అతను పొట్టివాడే కానీ చాలా గట్టి సంకల్పం కలవాడు. అందుకే అతని ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం తలవంచింది. పేదరికం ఓడిపోయింది. తనలోని బలహీనతను తలుచుకుని బాధపడుకుండా.. వ్యాయామంపై ఆసక్తి కనబరిచి.. తన శరీరాన్ని దృఢపరుచుకున్నాడు. వైకల్యాన్ని అధిగమించి.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచంలోనే అతి పొట్టి బాడీబిల్డర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకున్నాడు. అతనే మహారాష్ట్రకు చెందిన ప్రతీక్ విఠల్ మోహితే.
మూడు అడుగుల 4 అంగుళాల మోహితే.. ఖలాపుర్ తాలూకాలోని డోలవలికి చెందిన ఓ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆది నుంచి జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఎంతో కష్టపడి ఉన్నత విద్యను పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే బాడీబిల్డింగ్‌పై ఆసక్తితో వ్యాయామంపై దృష్టిసారించాడు మోహితే. 2016లో బాడీబిల్డింగ్ పోటీలో పాల్గొని.. విఫలమయ్యాడు. దీంతో మరింత శ్రమించి.. జిల్లా స్థాయి బాడీబిల్డింగ్ బరిలోకి దిగి.. రాయ్‌గఢ్ భూషణ్ అవార్డు అందుకున్నాడు.