Prasanth Kishore Pada Yaatra: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. 'జన్ సురాజ్' ప్రచారం కోసం బిహార్‌లో 3,500 కి.మీ. పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఆయన ఈ పాదయాత్ర ప్రారంభించారు. పట్నాలో ప్రత్యేక పూజల అనంతరం తన యాత్రను మొదలుపెట్టారు.
1917లో మహాత్మాగాంధీ మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన భితిహర్వా నుంచి ఆయన తన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్ర 12 నుంచి 18 నెలల పాటు కొనసాగనుంది. ఎలాంటి విరామం లేకుండా సాగనున్న యాత్రలో ప్రతీ పంచాయతీకి ఆయన వెళ్లనున్నారు. దాదాపు 3,500 కి.మీ ఆయన నడవనున్నారు.
కాన్వాయ్ ముందుకు పూజలు చేస్తున్న ప్రశాంత్ కిశోర్ 'ప్రజల నిర్ణయం మేరకే నా అడుగులు..'
ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించడానికి ఈ పాదయాత్ర ముందస్తు కసరత్తు అని విశ్లేషకులు చెబుతున్నా.. పీకే మాత్రం ఈ యాత్రలో ప్రజల నిర్ణయం మేరకే తన తర్వాతి అడుగులు ఉంటాయని అంటున్నారు. వెనుకబడిన రాష్ట్రమైన బిహార్‌లో కొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడానికి తన పాదయాత్ర ఉపయోగపడుతుందని పీకే చెబుతున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల మీదుగా తన పాదయాత్ర కొనసాగిస్తానంటూ ట్వీట్ చేశారు.
ప్రశాంత్ కిశోర్ ట్వీట్ మూడు లక్ష్యాలతో పీకే పాదయాత్ర..
మూడు లక్ష్యాలతో ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర కొనసాగనుందని ఆయన టీమ్ చెబుతోంది. క్షేత్రస్థాయిలో సరైన వ్యక్తులను గుర్తించడం, వారిని ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తీసుకురావడం, వివిధ రంగాల్లో ఉన్న నిపుణుల ఆలోచనలకు ప్రణాళికలు సిద్దం చేయడం వంటి లక్ష్యాలతో పాదయాత్ర సాగుతుందని పీకే టీమ్ స్పష్టం చేసింది.
'జన్ సురాజ్' సామాజిక సంస్థను స్థాపించి..
నిజానికి.. కొన్నేళ్ల క్రితమే పీకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. బిహార్‌లోని అధికార పక్షం జేడీయూ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఎక్కువ కాలం కొనసాగలేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జేడీయూ అధిష్ఠానం ఆయన్ను 2020 జనవరిలో బహిష్కరించింది. ఆ తర్వాత పీకే బిహార్ లో 'జన్ సురాజ్' పేరుతో ఒక సామాజిక సంస్థను స్థాపించారు. ఈ వేదిక పేరు మీదే ఆయన ఈ పాదయాత్ర చేపడుతున్నారు.
కాంగ్రెస్‌లో చేరటంపై హైడ్రామా!!
అయితే కొన్ని నెలల క్రితం ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహాగానాలు వచ్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోందని, అందుకే పీకేను పార్టీలో చేరుకుంటున్నట్లు వాదనలు వినిపించాయి. అందుకు బలం చేకూరుస్తూ.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనతో విస్తృత చర్చలు జరిపింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నేతలు కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్, ముకల్ వాస్నిక్, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, ఏకే ఆంటోనీ, అంబికా సోని, రణ్‌దీప్ సుర్జేవాలా వంటి నేతలతో భేటీ అయ్యారు. గత ఏప్రిల్‌లో నాలుగు రోజుల్లోనే సోనియాతో మూడుసార్లు భేటీ అయ్యారు పీకే. దాంతో కాంగ్రెస్‌లో చేరటం ఖాయం అనుకున్నారు అంతా.
కాంగ్రెస్ షరతుతో..
అయితే.. ప్రశాంత్ కిశోర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలంటే ఆయనకు ఓ షరతు విధించాలని ఆ పార్టీ నేతలు అధిష్ఠానానికి సూచించినట్లు సమాచారం. పీకే పార్టీలో చేరాక మరే ఇతర రాజకీయ పార్టీలకు ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయవద్దని, ఎలాంటి సేవలు అందించవద్దని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో హస్తం పార్టీకి షాకిచ్చారు పీకే. సాధికారిత బృందంలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
2024 ఎన్నికలపై పీకే లేటెస్ట్ ఎనాలసిస్ ఇదీ..
2024 సార్వత్రిక ఎన్నికల్లో జనామోదం పొందాలంటే విపక్షాల కూటమికి సారథిగా విశ్వసనీయమైన వ్యక్తిని నిలబెట్టడం, ప్రజా ఉద్యమం తీసుకురావడం అవసరమని కొన్ని రోజుల క్రితం ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. విపక్ష నేతలు.. వేర్వేరు పార్టీల నాయకులతో వరుస భేటీలు నిర్వహించినా పెద్దగా ఉపయోగం ఉండదని జోస్యం చెప్పారు. అసలు అలాంటి సమావేశాల్ని.. విపక్షాల ఐక్యత లేదా రాజకీయంగా సరికొత్త పరిణామంగా చూడరాదని సూచించారు.
భాజపాను ఎదుర్కోవడమే ప్రధాన అజెండాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, బిహార్ సీఎం నీతీశ్ కుమార్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఇతర విపక్ష నేతలతో ఇటీవల వరుస భేటీలు నిర్వహించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిశోర్. ఇంకా ఆయన చెప్పిన ఎనాలసిస్ను తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవీ చదవండి:ఫ్రూట్ బాక్సులపై డౌట్.. ఓపెన్ చేస్తే రూ. 1,476 కోట్ల డ్రగ్స్
మహాత్మా గాంధీకి ఘన నివాళి.. ముర్ము, మోదీ, సోనియా పుష్పాంజలి