Prashant Kishor on congress: కాంగ్రెస్ పార్టీ తన ట్రాక్ రికార్డును దెబ్బతీసిందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. అందుకే ఆ పార్టీతో పనిచేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బిహార్ రాష్ట్రంలో మార్పు కోసం ప్రయత్నించనున్నట్లు ఇటీవల ప్రకటించిన ఆయన.. వైశాలి జిల్లాలో సోమవారం ఓ సమావేశంలో పాల్గొన్నారు. 2011 నుంచి 2021 మధ్య 11 ఎన్నికలతో నేను భాగస్వామ్యమైనట్లు పేర్కొన్న ఆయన.. ఒక్కదాంట్లోనే ఓడిపోయినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
"2015లో బిహార్‌లో మహాఘట్బంధన్ను గెలిపించాం. 2016లో పంజాబ్ ఎన్నికల్లో గెలిచాం. 2019లో ఏపీ, 2020లో దిల్లీ, 2021లో తమిళనాడు, బంగాల్ రాష్ట్రాల్లో గెలిచాం. 2017లో యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేశాం. అక్కడ ఓడిపోయాం. అందువల్లే కాంగ్రెస్‌తో పనిచేయకూడదని అనుకున్నా. ఆ పార్టీ ఎలా ఉందంటే.. వారు మునిగిపోవడమే కాకుండా మనల్ని కూడా ముంచేస్తున్నారు. పదేళ్లలో 11 ఎన్నికల్లో నేను పాల్గొంటే ఒక్కటే.. అది కూడా కాంగ్రెస్‌తో కలిసినప్పుడే ఓడిపోయా. నా ట్రాక్ రికార్డును వారు దెబ్బతీశారు."
-ప్రశాంత్ కిశోర్, ఎన్నికల వ్యూహకర్త