Prashant Kishor on Modi: 2024 సార్వత్రిక ఎన్నికల తీర్పును 2022లోనే ప్రజలు వెలువరించారన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. భారత్ కోసం అసలు యుద్ధం 2024లోనే జరుగుతుందని, అప్పుడే విజేత ఎవరో తెలుస్తుందని ట్వీట్ చేశారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేవని అన్నారు. సాహెబ్‌కు ఇది తెలుసంటూ పరోక్షంగా మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విపక్షాలపై మానసికంగా పైచేయి సాధించడానికి రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను వారు ఇలా తెలివిగా ఉపయోగించుకుంటున్నారని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు కథనాలకు మోసపోవద్దని ప్రజలను కోరారు.
ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా సత్తా చాటగా.. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను 2022లోనే ప్రజలు నిర్ణయించారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
అఖిలేశ్ రియాక్షన్..
యూపీ ఎన్నికల్లో ఓడినప్పటికీ సమాజ్‌వాదీ సీట్లు రెండున్నర రెట్లు పెరిగాయని ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. భాజపా సీట్లను తగ్గించవచ్చని రుజువైందని పేర్కొన్నారు. భాజపా మోసాలు, గందరగోళాన్ని సగం తగ్గించామని, రానున్న రోజుల్లో పూర్తిగా పతనం చేస్తామని అన్నారు.