Prashant Kishor politics: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా? 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించనున్నారా? ఆయన తాజాగా చేసిన ట్వీట్ చూస్తే ఔననే సమాధానం వినిపిస్తోంది. "ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామిని అయి, ప్రజానుకూల విధానాల రూపకల్పనలో సాయం చేయడంలో పదేళ్లు గడిచాయి. ఇప్పుడు నేరుగా ప్రజల దగ్గరకు చేరువకావాల్సిన సమయం వచ్చింది. వారి సమస్యల్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, జన సురాజ్‌కు బాటలు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆరంభం బిహార్ నుంచే.." అని ట్వీట్ చేశారు ప్రశాంత్.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై పీకే మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఆయన కొత్తగా పార్టీ పెడతారా, ఏదైనా దిగ్గజ పార్టీలో చేరి తన అజెండాను ముందుకు తీసుకెళ్తారా అని చూడాల్సి ఉంది. నిజానికి.. కొన్నేళ్ల క్రితమే పీకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. బిహార్‌లోని అధికార పక్షం జేడీయూ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఎక్కువ కాలం కొనసాగలేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జేడీయూ అధిష్ఠానం ఆయన్ను 2020 జనవరిలో బహిష్కరించింది.
కాంగ్రెస్‌లో చేరటంపై హైడ్రామా?: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని, కాంగ్రెస్ పార్టీలో చేరతారని గత కొంత కాలంగా హాట్‌టాపిక్‌గా మారింది. 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోందని, అందుకే పీకేను పార్టీలో చేరుకుంటున్నట్లు వాదనలు వినిపించాయి. అందుకు బలం చేకూరుస్తూ.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనతో విస్తృత చర్చలు జరిపింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నేతలు కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్, ముకల్ వాస్నిక్, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, ఏకే ఆంటోనీ, అంబికా సోని, రణ్‌దీప్ సుర్జేవాలా వంటి నేతలతో భేటీ అయ్యారు. గత ఏప్రిల్‌లో నాలుగు రోజుల్లోనే సోనియాతో మూడుసార్లు భేటీ అయ్యారు పీకే. దాంతో కాంగ్రెస్‌లో చేరటం ఖాయం అనుకున్నారు అంతా.
అయితే.. ప్రశాంత్ కిశోర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలంటే ఆయనకు ఓ షరతు విధించాలని ఆ పార్టీ నేతలు అధిష్ఠానానికి సూచించినట్లు సమాచారం. పీకే పార్టీలో చేరాక మరే ఇతర రాజకీయ పార్టీలకు ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయవద్దని, ఎలాంటి సేవలు అందించవద్దని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో హస్తం పార్టీకి షాకిచ్చారు పీకే. సాధికారిత బృందంలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. తాను పార్టీలో చేరట్లేదని, తనకన్నా కాంగ్రెస్‌కు నాయకత్వం అవసరమని పేర్కొన్నారు.
తెరాసతో కలిసి పని చేస్తారా?: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెరాస.. ఐప్యాక్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది. ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు, సూచనలతో ఎన్నికలకు వెళ్లేందుకు ఒప్పందం సైతం చేసుకున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే తెరాసతో కలిసి పనిచేస్తారా? అనే విషయం ఆసక్తి కలిగిస్తోంది.
ఇదీ చూడండి:'పార్టీలో చేరను.. మీ కోసం పని చేయను'.. కాంగ్రెస్‌కు పీకే ఝలక్!