Sonia Gandhi PK Meet: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం సాగుతున్న వేళ.. ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పీకే సమావేశమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితర నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ ఏడాది చివరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకే భేటీ అయినట్లు.. కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికల బ్లూప్రింట్‌పై కూడా చర్చించినట్టు తెలుస్తోంది.
Prashanth Kishore: సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్‌లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గతంలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన ప్రశాంత్ కిషోర్.. ఇటీవల మళ్లీ చర్చలు ప్రారంభించారు. మే 2వ తేదీలోపు తన భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తానని పీకే గడువు విధించగా.. సలహాదారుగా కాకుండా పార్టీలోకి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా 2024 ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. ఇక, 2020లో కాంగ్రెస్‌లో చేరాలని ప్రశాంత్ కిషోర్ ముందస్తుగా ప్లాన్ చేసుకున్నప్పటికీ, అనేక విషయాలపై విభేదాల కారణంగా కుదరలేదు. ఇక, మార్చిలో ప్రశాంత్ కిషోర్.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిశారని గతంలో ప్రచారం సాగింది. అయితే ఆ భేటీపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా, పీకే మళ్లీ పార్టీలో చేరుతున్నారనే సందడి మాత్రం ఇప్పుడు కనిపిస్తోంది. గతంలో, ప్రశాంత్ కిషోర్ 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 117 స్థానాలకు గాను 77 స్థానాలను గెలుచుకుంది. ఇక 2014 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఘనవిజయంతో కిశోర్‌కు మంచి గుర్తింపు లభించింది.