ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో సమావేశమైన కొన్నిరోజుల తర్వాత రాహుల్‌తో ఆయన భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. దిల్లీలోని రాహుల్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, పంజాబ్ కాంగ్రెస్ ఇంఛార్జి హరీష్ రావత్ కూడా పాల్గొన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీ, పంజాబ్ శాసనసభ ఎన్నికలపై వీరంతా చర్చించినట్లు సమాచారం.
కూటమిపై?
గత నెల 11న ముంబయిలో మొదటిసారి శరద్ పవార్‌తో సమావేశమైన ప్రశాంత్ కిశోర్.. అదే నెల 21న రెండోసారి దిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. దాదాపు 3గంటల పాటు పవార్-ప్రశాంత్ కిశోర్ ఏకాంతంగా సమాలోచనలు జరపటం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలతో కూటమి ఏర్పాటు అంశంపైనే పవార్-ప్రశాంత్ కిశోర్ చర్చించినట్లు ప్రచారం జరిగింది. కాంగ్రెస్ లేకుండా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు అసాధ్యమని పవార్ పేర్కొన్న నేపథ్యంలో... రాహుల్ గాంధీని ప్రశాంత్ కిశోర్ కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది.