Prashant Kishor Congress: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. మరోసారి కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించారు. దేశ రాజకీయాల్లో ప్రతిపక్షంగా ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న స్థానం కీలకమని.. కానీ ఆ పార్టీ నాయకత్వం సరిగా లేదని ఆరోపించారు. విపక్షాలకు నాయకత్వం వహించడం.. దేవుడు ఇచ్చిన హక్కుగా వారు భావిస్తున్నారని ట్వీట్ చేశారు.
''బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్న స్థానం కీలకం. కానీ విపక్షాలకు కాంగ్రెస్ నాయకత్వం వహించడం దేవుడు ఇచ్చిన హక్కేం కాదు. ముఖ్యంగా.. గత పదేళ్లలో 90 శాతం ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది.''
- ప్రశాంత్ కిశోర్, ఎన్నికల వ్యూహకర్త
విపక్షాలకు ఎవరు నేతృత్వం వహించాలో.. ప్రజాసామ్యయుతంగా నిర్ణయించాలని అన్నారు ప్రశాంత్.
'ప్రస్తుతం యూపీఏ అనేదే లేదు' అని బంగాల్సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన మరుసటి రోజే పీకే ఇలా ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాంగ్రెస్ కౌంటర్
పీకే వ్యాఖ్యలను కాంగ్రెస్ వెంటనే తిప్పికొట్టింది. ఆయన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా.. పీకేను సైద్ధాంతిక నిబద్ధత లేని వ్యక్తిగా అభివర్ణించారు.
''ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో పార్టీలకు ఆయన ఉచితంగా సలహాలు ఇవ్వొచ్చు కానీ.. మన రాజకీయాల అజెండాను ఆయన నిర్దేశించలేరు.''
- పవన్ ఖేరా, కాంగ్రెస్ ప్రతినిధి
కొన్ని నెలల క్రితం పీకే.. కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరిగింది. కానీ పార్టీ సీనియర్లు కొందరు దీనిని వ్యతిరేకించినట్లు తెలిసింది. అప్పటి నుంచి ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌పై వరుస విమర్శలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ బలమైన నేత అని, ఆమెను చూసి రాహుల్ భయపడుతున్నారని ఓసారి ట్వీట్ చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరి ఉదంతంపై ఉద్యమించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రతిపక్ష పాత్ర వేగంగా బలోపేతం అవుతుందని అశపెట్టుకోవడం తొందరపాటు అవుతుందని హెచ్చరించారు పీకే. అంతర్గతంగా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ పునరుత్థానం సాధించలేదని చెప్పారు.
ఇదీ చూడండి:Mamata Vs Congress: టీఎంసీ, కాంగ్రెస్ ఫైట్- భాజపా సేఫ్!