Prakash Raj ED Notice : ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు ఇచ్చింది. రూ.100 కోట్ల పోంజీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో చెన్నైలో వచ్చేవారం విచారణకు రావాలని సూచించింది. తిరుచ్చికి చెందిన ఓ ఆభరణాల సంస్థపై ఈ కేసు నమోదైంది. ఆ సంస్థకు ప్రకాశ్ రాజ్ ప్రచారకర్తగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను విచారణకు పిలిచింది ఈడీ. బీజేపీపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో నోటీసులు రావడం గమనార్హం.
పెట్టుబడి పథకం పేరుతో మోసం!
తిరుచ్చికి చెందిన ప్రణవ్ జువెలర్స్ అనే పార్ట్నర్షిప్ కంపెనీపై నవంబర్ 20న ఈడీ దాడులు చేసింది. ఆ జువెలరీ సంస్థ నుంచి లెక్కల్లో చూపని రూ.23.70 లక్షలు నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. తమిళనాడు పోలీస్ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. బంగారంపై పెట్టుబడుల పథకం పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లు.. ప్రణవ్ జువెలర్స్ సేకరించిందని పోలీసులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అధిక రిటర్న్స్ ఇస్తామని ఈ మొత్తం సేకరించారని పేర్కొన్నారు.
"ఇన్వెస్టర్లకు డబ్బులు తిరిగి ఇవ్వడంలో ప్రణవ్ జువెలర్స్ విఫలమైంది. బంగారు ఆభరణాలు కొనుగోలు పేరిట షెల్ కంపెనీలకు డబ్బులు తరలించి ప్రజల్ని మోసం చేసింది. ప్రణవ్ జువెలర్స్ ఖాతాల్లో బోగస్ ఎంట్రీలు సృష్టించినట్లు సప్లయర్ పార్టీలు అంగీకరించారు. బ్యాంకు పేమెంట్లకు బదులుగా కంపెనీ నుంచి డబ్బు తీసుకున్నట్లు ఒప్పుకున్నారు."
-ఈడీ