Pragyan Rover Wake Up :చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగ్విజయంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయి.. భారతావనిని పులకింపజేసి.. ఇస్రోకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు ఇంకా నిద్రాణస్థితి నుంచి తిరిగి బయటికిరాలేదు. జాబిల్లిపై పరిశోధనలు చేసి విలువైన సమాచారాన్ని పంపిన విక్రమ్, ప్రజ్ఞాన్‌లను.. చంద్రునిపై రాత్రివేళ ఉండే అతిశీతల పరిస్థితుల దృష్ట్యా.. ఈనెల 2, 4 తేదీల్లో ఇస్రో నిద్రాణస్థితిలోకి పంపింది.
చంద్రునిపై పగలు మొదలుకావడం వల్ల సూర్యరశ్మి గ్రహించి బ్యాటరీలు రీచార్జ్ అయితే.. క్రియాశీలం అయ్యే అవకాశం ఉంది. ఇస్రో కూడా ల్యాండర్, రోవర్ నుంచి కమ్యూనికేషన్ పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొంది. ఇప్పటివరకు ఎలాంటి సిగ్నల్స్ లేవని.. అయితే ప్రయత్నాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని తెలిపింది.
విక్రమ్, ప్రజ్ఞాన్‌లను స్లీప్ మోడ్ నుంచి యాక్టివ్ మోడ్‌లోకి తీసుకురావడం పెద్ద సవాల్‌తో కూడిన అంశమని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ చెప్పారు. అయితే రోవర్, ల్యాండర్లు క్రియాశీలం అయితే.. గతం కన్నా మూడురెట్లు ఎక్కువ ఫలితాలు సాధించే అవకాశం తెలిపారు. ప్రస్తుతం ల్యాండర్‌లో 90కిలోల ఇంధనం ఇంకా మిగిలే ఉందన్నారు. మైనస్ 200డిగ్రీల ఉష్ణోగ్రత కారణంగా ఇంధనం గడ్డ కడుతుందని.. అది తిరిగి ద్రవరూపంలోకి మారటానికి శక్తి అవసరం అవుతుందన్నారు. ఒకవేళ ఇంధనాన్ని మండించాలనుకున్నా కూడా.. ప్రొపల్షన్ సిస్టమ్ మొత్తం విఫలం అవుతుందని సోమ్‌నాథ్ చెప్పారు. ప్రస్తుత ఉష్ణోగ్రతల వద్ద ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు డ్యామేజ్ అవడమే కాకుండా సాఫ్ట్ వేర్ కూడా పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు.