తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'విద్యుత్తు' హక్కుల పరిరక్షణకు కొత్త నిబంధనలివే.. - విద్యుత్తు శాఖ కొత్త నిబంధనలు

విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? కొత్త కనెక్షన్​ తీసుకునేందుకు, పాత వాటిని మార్చేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారా? తరచుగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందా? అయితే ఇది మీకోసమే. విద్యుత్తు వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కొత్త నిబంధనలు జారీ చేసింది కేంద్రం. అవేంటో తెలుసుకుందాం రండి..

rules to protect electricity consumers
విద్యుత్తు సరఫరాలో అంతరాయానికి పరిహారం!

By

Published : Dec 21, 2020, 9:06 PM IST

దేశంలో విద్యుత్తు వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం పలు నియమ నిబంధనలు జారీ చేశారు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్​కే సింగ్​. ఈ క్రమంలో వినియోగదారులు శక్తిహీనులు కాదని, వారి చేతిలో కొత్త ఆయుధాలు చేరాయని నొక్కి చెప్పారు. కొత్త నియమాల ప్రకారం.. సరైన ప్రమాణాలు పాటించని విద్యుత్తు పంపిణీ యుటిలిటీలు (డిస్కమ్​)లకు జరిమానాలు విధించే అవకాశం లభించనుంది.

విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్​ సమావేశంలో కొత్త నియమాలను వెల్లడించారు కేంద్ర మంత్రి. ఈ నియమాలు వినియోగదారులను శక్తమంతం చేస్తాయని పేర్కన్నారు.

"వినియోగదారులకు విద్యుత్తు సంస్థలు సరైన సేవలు అందించాలని ఈ నియమాలు సూచిస్తున్నాయి. సేవలతో పాటు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్తును పొందే హక్కు వారికి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేటు పంపిణీ సంస్థలు గుత్తాధిపత్యం చలాయిస్తున్నాయి. వినియోగదారులకు వేరే అవకాశం లేదు. అందుకే కొత్త నియమాల్లో వినియోగదారుల హక్కులను పరిగణనలోకి తీసుకున్నాం."

- ఆర్​కే సింగ్​, కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి.

నిబంధనల్లోని కీలక అంశాలు..

  • వినియోగదారుడు తమకు విద్యుత్తు సౌకర్యం కల్పించాలని కోరిన క్రమంలో విద్యుత్తు చట్టానికి లోబడి పంపిణీ సంస్థలు విద్యుత్తు సరఫరా అందించాలి. పంపిణీ సంస్థల నుంచి కనీస ప్రమణాలతో విద్యుత్తు సరఫరా పొందడం ప్రతి వినియోగదారుడి హక్కు.
  • కొత్త కనెక్షన్లు ఇవ్వటం, పాతవాటిని మార్చటం వంటి ప్రక్రియలో పారదర్శకంగా, సులభమైన, సరైన సమయంలో డిస్కమ్​లు సేవలందించాలి. విద్యుత్తు కనెక్షన్​ కోసం దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తుదారునికి ఆన్​లైన్​లోనూ అవకాశం ఇవ్వాలి. మెట్రో నగరాల్లో 7 రోజులు, ఇతర మున్సిపల్​ ప్రాంతాల్లో 15 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల్లోపు విద్యుత్తు కనెక్షన్​ ఇవ్వాలి.
  • విద్యుత్తు మీటర్​ లేకుండా కొత్త కనెక్షన్​ ఇవ్వకూడదు. స్మార్ట్​ ప్రీ-పేమెంట్​ మీటర్​ లేదా, ప్రీ-పేమెంట్​ మీటర్​ తప్పనిసరిగా బిగించాలి. వినియోగదారులకు అందించే బిల్లులో పారదర్శకత ఉండాలి. బిల్లుల చెల్లింపునకు.. ఆన్​లైన్​లో లేదా ఆఫ్​లైన్​లో అవకాశం కల్పించాలి.
  • సంస్థ విశ్వసనీయతను పెంచేందుకు వినియోగదారులకు డిస్కమ్​లు 24x7 విద్యుత్తు సరఫరా చేయాలి. లోపాలను పర్యవేక్షించటం, పునరుద్ధరించటానికి సాధ్యమైనంత మేరకు ఆటోమేటెడ్​ సాధనాలతో కూడిన ఒక యంత్రాంగాన్ని డిస్కమ్​లు సిద్ధంగా ఉంచుకోవాలి.
  • విద్యుత్తు ఉత్పత్తి చేసే వినియోగదారులు (ప్రోస్యూమర్స్​) కేటగిరిలోనూ.. వారిని సాధారణ వినియోగదారులుగానే పరిగణించాలి. వారికి కూడా సమాన హక్కులు లభిస్తాయి. ఇంటిపై పునరుత్పాదక విద్యుత్తు యూనిట్లను ఏర్పాటు చేసుకునే హక్కు కూడా ఉంటుంది.
  • డిస్కమ్​ల పనితీరుపై విద్యుత్తు నియంత్రణ కమిషన్​ ర్యాంకులు కేటాయిస్తుంది. సరైన ప్రమాణాలు పాటించని డిస్కమ్​లు వినియోగదారులకు పరిహారం అందించాలి. నిబంధనల్లోని పరిమితికి మించి విద్యుత్తు అంతరాయం ఏర్పడినప్పుడూ డిస్కమ్​లు పరిహారం చెల్లించాలి.
  • డిస్కమ్​ల పనితీరును విద్యుత్తు కనెక్షన్​లు ఇచ్చేందుకు తీసుకున్న సమయం, తొలగింపు, పునరుద్ధరణ, మార్పు వంటి వాటి ఆధారంగా నిర్ణయిస్తారు. అలాగే.. వినియోగదారుడి కేటగిరి, లోడ్​, వ్యక్తిగత వివరాల మార్పు, పాడైన మీటర్లను తొలగించి కొత్తవాటిని అమర్చటానికి తీసుకున్న సమయం, బిల్లులు వేసేందుకు తీసుకున్న సమయం, వాటికి సంబంధించిన ఫిర్యాదులు, ఓల్టేజ్​కు సంబంధించిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటారు.
  • కమిషన్​ నిర్ణయించిన సమయంలోపు విద్యుత్తు సేవలు అందించని వినియోగదారుడికి డిస్కమ్​లు పరిహారం చెల్లించాలి.
  • వినియోగదారుల కోసం సెంట్రలైజ్డ్​ 24x7 టోల్​ ఫ్రీ కాల్​సెంటర్​ ఏర్పాటు చేయాలి. కామన్​ కస్టమర్​ రిలేషన్​ మేనేజర్​ (సీఆర్​ఎం) వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలి. వినియోగదారుల సమస్యల పరిష్కార ఫోరం (సీజీఆర్​ఎఫ్​)ను ఏర్పాటు చేయాలి. అందులో వినియోగదారులు, ప్రోస్యూమర్స్​ను భాగం చేయాలి. వినియోగదారుల సంఖ్యను 1 నుంచి నాలుగుకు పెంచాలి. వినియోగదారుడి సమస్యను 45 రోజుల్లోపు పరిష్కరించాలి.
  • వయోవృద్ధుల కోసం విద్యుత్తు కనెక్షన్ దరఖాస్తులు, బిల్లు పేమెంట్​​ వంటి సేవలను ఇంటివద్దే అందించే సౌకర్యం కల్పించాలి.
  • విద్యుత్తు అంతరాయాలపై ముందుగానే వినియోగదారులకు సమాచారం అందించాలి. అనుకోని అంతరాయాల సమయంలో ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపాలి.

ఇదీ చూడండి: వినీలాకాశంలో ఖగోళ అద్భుతం.. అతి దగ్గరగా గ్రహాలు

ABOUT THE AUTHOR

...view details