రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వాళ్లది. అయినా తమ పిల్లలను చదివించేందుకు ఆ తల్లితండ్రులు వెనకడుగువేయలేదు. దీనికి ప్రతిఫలంగా.. కష్టపడి చదివి చిన్న వయసులోనే సివిల్ జడ్జిగా ఎంపికైంది ఓ యువతి. దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల గ్రామానికి చెందిన ఆమె పేరు చేతన. వయసు 29 సంవత్సరాలు.
2020లో కర్ణాటక హైకోర్టు సివిల్ జడ్జి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది చేతన. తర్వాత 2021 ఫిబ్రవరి 25న విడుదలైన నోటిఫికేషన్లో కర్ణాటక సివిల్ జడ్జిగా ఎంపికైంది. తల్లితండ్రుల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని చెబుతోంది.
"అమ్మ, నాన్న చాలా కష్టపడి పనిచేసి నన్ను చదివించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా .. పిల్లల్ని చదివించే విషయంలో వారు వెనకడుగు వేయలేదు. కష్టపడటాన్ని భారంగా భావించొద్దని అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది. నిర్భయంగా సమస్యలను ఎదుర్కోవాలని ధైర్యాన్నిచ్చేది. ఇప్పుడు అమ్మ కల ఫలించింది."
- చేతన, సివిల్ జడ్జి.
బెళ్తన్గడికి చెందిన రామన్న పూజారి, సీత దంపతులకు ముగ్గురు కుమారులు ఓ కుమార్తె. చేతన అందరిలో చిన్నది. అయితే.. పేదరికం కారణంగా ఆమె డిగ్రీ ఆనంతరం బెంగుళూరులో ఉద్యోగం చేయడం మొదలు పెట్టింది. కానీ, ఇందుకు ఆమె తల్లి ఒప్పుకోలేదు. చేతన లాయర్ కావాలని సంకల్పించేలా ప్రోత్సహించింది.