Postal GDS notification 2023 : తపాలా శాఖలో కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా 30 వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో 40 వేలకు పైగా పోస్టులు ప్రకటించింది ఇండియా పోస్ట్. అందులో భాగంగా మే నెలలో 12,828 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీని భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగానే.. మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 30,041 జీడీఎస్ పోస్టుల కోసం ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే.. పదో తరగతి పాసైతే సరిపోతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 23 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్లు https://indiapostgdsonline.gov.in/ ద్వారా మాత్రమే సమర్పించాలి. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే.. ఆగస్టు 24 నుంచి 26 మధ్య సవరించుకునే సమయం ఉంటుంది.
పరీక్ష లేకుండానే ఉద్యోగం..
బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం) / డాక్ సేవక్ పోస్టులకు రాత పరీక్ష ఏమీ ఉండదు. పదో తరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ మేరకు నోటిఫికేషన్లో వివరాలు పొందుపర్చారు.
అర్హతలు ఏంటంటే?
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి తప్పనిసరిగా పాసై ఉండాలి.
- అయితే, పదో తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాషలో చదివి ఉండాలి.
- దీంతో పాటు అభ్యర్థికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
- సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.