మే 2న.. అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ్‌బంగా రాష్ట్రాల్లో వివిధ పార్టీల భవితవ్యం తేలనుంది. అయితే... శాసనసభ ఎన్నికలు జరిగిన ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారం చేపడుతుందనే అంచనాలు వేశాయి. ఈ రాష్ట్రాల భవితవ్యంపై ఈటీవీ-భారత్ చేసిన సర్వే వివరాలు...
బంగాల్‌లో తృణమూల్‌దే హవా!
జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన బంగాల్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈటీవీ భారత్ సర్వే ఫలితాలను ప్రకటించింది. మరోసారి బంగాల్‌లో టీఎంసీ హవా కొనసాగుతుందని అంచనా వేస్తోంది.
అయితే.. బంగాల్‌లో ఎలాగైనా అధికారం చేపట్టాలనే వ్యూహంతో భాజపా తీవ్రంగా కృషి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా సహా పలువురు కీలక నేతలు భాజపా తరఫున పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. మరోవైపు ఈసారి కూడా అధికారం తప్పక తమదే అని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. మెజార్టీ సర్వేలు తృణమూల్‌దే అధికారం అని తేల్చినా, ఆ పార్టీకి, భాజపాకు మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉందని ఈటీవీ భారత్ సర్వే చెబుతోంది.
ఫలించనున్న డీఎంకే నిరీక్షణ..
దక్షిణాదిలో శాసనసభ ఎన్నికలు జరిగిన పెద్ద రాష్ట్రం తమిళనాడులో డీఎంకే ఘన విజయం సాధించబోతోందని ఈటీవీ-భారత్ ఎగ్జిట్ పోల్స్ అంచనా. భాజపాతో కలిసి బరిలోకి దిగిన అన్నాడీఎంకేకు భారీ ఓటమి తప్పదని సర్వేలో తెలుస్తోంది.