లల్లాయి..లాయి..లాయి లడ్డూలు..! బిహార్.. ఎన్నో సంప్రదాయ మిఠాయిలకు, ఆహా అనిపించే తీపి రుచులకు ప్రసిద్ధి. రామ్‌దానా, కోవాతో తయారుచేసే లాయి...వాటిలో ఒకటి. చూసేందుకు లడ్డూలా కనిపించే ఈ మిఠాయికి..విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఒకసారి తింటే మళ్లీమళ్లీ తినాలనిపించక మానదు. పట్నా నుంచి గయా వెళ్లే మార్గంలోని ధన్‌రూవా, పట్నా నుంచి మోకమా వెళ్లే మార్గంలోని బాడ్‌లో ఈ లడ్డూలు దొరుకుతాయి. రెండు ప్రాంతాలూ పట్నా జిల్లాలానే ఉన్నాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఈ మిఠాయిను ఇష్టంగా తింటారు.
"పట్నా నుంచి బెగుసరాయికి ఎప్పుడు వెళ్లినా...బాడ్ వద్ద తప్పకుండా ఆగి, లడ్డూలు కొనుక్కుంటాం. మా ఇంట్లో వాళ్లందరికీ ఈ మిఠాయి అంటే చాలా ఇష్టం."
-రమేష్ కుమార్
ఈ లడ్డూలను ఫ్రిజ్‌లో పెట్టకున్నా ఎక్కువ కాలం నిల్వ ఉండగలదు. ఇదే ఈ మిఠాయి ప్రత్యేకత. లడ్డూను ఎంత ప్రత్యేక శ్రద్ధతో తయారు చేస్తారో తయారీదారులు వివరిస్తున్నారు.
"ఈ లడ్డూలో డ్రైఫ్రూట్స్ ఎక్కువగా కలపడం వల్ల రుచి అద్భుతంగా ఉంటుంది. పంచదార, కోవా, యాలకులు, జీడిపప్పు కూడా కలుపుతారు. బాడ్‌లో రెండు రకాల లడ్డూలు తయారవుతాయి. ఒకటి పంచదార లడ్డూ, మరోరకం పంచదార లేని లడ్డు. "
-రతన్ గుప్తా, లడ్డూ తయారీదారు
తక్కువ పంచదారతో తయారయే లడ్డూ ధరెక్కువ. గడిచిన కొన్నేళ్లుగా లడ్డూ రుచి, తయారీ విధానంలో చాలా మార్పులే చోటుచేసుకున్నాయట. ఆ కథ కూడా ఆసక్తికరమే.
"బాడ్ ప్రాంతంలోని చొండి గ్రామస్థుడు గోవింద్ షా ఈ లడ్డూను మొట్టమొదటిసారిగా తయారుచేశాడు. తర్వాత ఆయన కుమారుడు వ్యాపారం విస్తరించాడు."
-అవినాష్ కుమార్, వ్యాపారి
స్థానికంగా లాయి అని పిలిచే ఈ లడ్డూని మొదటిసారిగా బాడ్‌కు చెందిన రాంపదారత్ సావ్ అనే మరో వ్యక్తి తయారుచేశాడని కొందరు చెబుతారు. ఓరోజు మిగిలిపోయిన పాలు వృథాగా పోకుండా వాటికి కోవా కలిపి ఓ మిఠాయి తయారుచేశాడట. అలా తయారైన లాయి...ఎంతగా జనాదరణ పొందిందటే...బాడ్‌లోనే 60 కేంద్రాల్లో రోజుకు 2 నుంచి రెండున్నర లక్షల రూపాయల విలువైన, 100 క్వింటాళ్ల లడ్డూ ఉత్పత్తవుతోంది. 7 వేలమందికి పైగా ఈ లడ్డే జీవనాధారం.
"బాడ్ లడ్డూ బాగా ఆదరణ పొందింది. ఈ మిఠాయిపైనే మా బతుకుదెరువు ఆధారపడి ఉంది. లడ్డూలు తయారుచేసే వాళ్లకూ, వాటిని విక్రయించే వ్యాపారులకూ ప్రభుత్వం నుంచి రాయితీల్లాంటి ప్రోత్సాహాలేవీ లేకపోవడం దురదృష్టకరం."
-శశిభూషణ్ కుమార్, వ్యాపారి
రుచి, స్వచ్ఛత విషయంలో ధనారువా లాయి...చాలా ప్రసిద్ధి. దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి, లడ్డూ వల్లే ధనారువాకి గుర్తింపు వచ్చింది. విదేశాల నుంచి బోధ్ గయా వెళ్లే పర్యటకులు సైతం... ఇక్కడ ఆగి, మిఠాయి కొనుక్కొని వెళ్తారు. అక్కడ తినడమే కాదు...తమతో పాటు స్వదేశాలకూ తీసుకెళ్తారు.
"ధన్‌రువా లడ్డు చాలా ఫేమస్. ఈ దారిలో ఎప్పుడు వెళ్లినా లడ్డూలు కొని, ఇంటికి తీసుకెళ్లడం మాత్రం అస్సలు మర్చిపోను. చాలా రుచికరంగా ఉంటాయి."
-సిమ్రన్ ఝా
ధన్‌రూవాలో.. విజయ్ లాయి దుకాణం చాలా ప్రసిద్ధి. ఈ దుకాణం యజమాని పూర్వీకులే లాయి తయారుచేసి, అమ్మడం మొదలుపెట్టారట. రోజుకు 500 కిలోల లడ్డూలు ఈ దుకాణంలో తయారవుతాయి. కిలో లడ్డూ ధర 350 రూపాయలు. ఒక్క లడ్డూ తయారు చేసేందుకు 6రూపాయల 25 పైసలు ఖర్చవుతుంది. ధన్‌రూవా రహదారిపై అడుగడుగునా మిఠాయి దుకాణాలు కనిపిస్తాయి. బాడ్, ధన్‌రూవాలలో కలిపి, 150 దుకాణాల్లో ఏడాదికి 5 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఇంతలా మార్కెట్ విస్తరించినా...ఇప్పటికీ ధన్‌రూవా లాయి విక్రయాలు డిజిటలైజ్ కాలేదని వ్యాపారులు వాపోతున్నారు.
"డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో...ఆన్‌లైన్‌లో అమ్ముకునే సదుపాయాలు ఉండి ఉంటే, వార్షిక టర్నోవర్ 20 కోట్లు సులభంగా దాటి ఉండేది. కానీ... సరైన సదుపాయాలు లేక, లడ్డూ విక్రయాలు డిజిటలైజ్ చేయడం కుదరడం లేదు."
-బిపిన్ చంద్రవంశీ, వ్యాపారి
లడ్డూల తయారీ, అమ్మకాలతో ముడిపడి ఉన్న వ్యాపారస్థులు...లడ్డూ విక్రయాలను డిజిటలైజ్ చేస్తే లాయి మార్కెట్ మరింత విస్తృతమయ్యే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
"ఆన్‌లైన్‌లో లడ్డూ విక్రయాలు ప్రారంభమైతే..అటు వ్యాపారం, ఇటు ఉత్పత్తీ రెండూ పెరుగుతాయి. ధన్‌రూవాలో ఏటా 7 నుంచి 8 కోట్ల వ్యాపారం జరుగుతుందని కచ్చితంగా చెప్పగలను. విదేశాల్లో నివసించేవారు కూడా కొనుక్కోవచ్చు. "
-కపిల్ వర్మ, దుకాణం యజమాని
లడ్డూ తిన్నవారెవరైనా ఆహా అనక మానరు. స్థానికతకే పెద్దపీట అన్న నినాదాలు, చర్చలు దేశవ్యాప్తంగా ఊపందుకున్నా ఇంతటి ప్రసిద్ధ మిఠాయి అమ్మకాలకు ఆన్‌లైన్ వేదిక కల్పించకపోవడం పట్ల వ్యాపారస్థులు విచారంగా ఉన్నారు. బాడ్, ధన్‌రూవాలలో తయారయే లాయి...రష్యా, అమెరికా, ఇంగ్లండ్ లాంటి దేశాలకూ చేరువవుతోంది. ఈ వ్యాపారం డిజిటలైజ్ అయితే...బిహార్ లడ్డూలు ప్రపంచం నలుమూలలకూ చేరేందుకు ఎంతో సమయం పట్టదు.
ఇదీ చూడండి: శిథిలావస్థకు చారిత్రక కశ్మీరీ హౌస్బోట్స్