Drone Festival 2022: గత ప్రభుత్వాలు సాంకేతికత వినియోగం పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఎంతో నష్టం వాటిల్లిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వాళ్లు సాంకేతికతను ఓ సమస్యగా చూసేవారని, పేదల వ్యతిరేకిగా దానికి ముద్ర వేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. 8 ఏళ్ల క్రితం తాము పరిపాలనలో సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించామని పేర్కొన్నారు. కనిష్ట ప్రభుత్వం- గరిష్ఠ పాలన- సులభతర జీవన విధానం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దిల్లీలో రెండు రోజుల పాటు జరిగే డ్రోన్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొని ప్రధాని ఈ మేరకు మాట్లాడారు. భారతదేశంలో డ్రోన్ల సాంకేతికత సరికొత్త విప్లవం తీసుకువచ్చిందన్నారు.
" పరిపాలనలో సాంకేతికత కూడా చాలా ముఖ్యం. సుదూర ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ప్రభుత్వ ఫలాలు చేరవేసేందుకు ఇది సాయం చేస్తుంది. భారత్‌లో డ్రోన్ల సాంకేతిక పట్ల ఉత్సాహం, ఆసక్తి కన్పిస్తోంది. ఉద్యోగాల కల్పనకు ఈ రంగం దోహదం చేసే అవకాశాలున్నాయి. 2014కు ముందు పరిపాలనలో సాంకేతికతను ఓ సమస్యగా భావించేవారు. అందువల్ల పేదలు నష్టపోయారు. డ్రోన్ సాంకేతికత వల్ల ఎలాంటి మార్పులు వస్తాయో, ఎంత ఉపయోగం ఉంటుందో పీఎం స్వామిత్వ యోజన ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. దేశంలో తొలిసారి ప్రతి గ్రామంలోని ఆస్తులను డిజిటల్‌గా మ్యాప్ చేస్తున్నాం. డిజిటల్ ప్రాపర్టీ కార్డులు జారీ చేస్తున్నాం. భవిష్యత్తులో వ్యవసాయం, రక్షణ, క్రీడ, విపత్తు నిర్వహణ రంగాల్లో డ్రోన్ల ఉపయోగం చాలా పెరుగుతుంది. నేను అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పుడు డ్రోన్ల ద్వారా అభివృద్ధి పనుల పురోగతి గురించి తెలుసుకుంటున్నా."