Ponmudi Convicted Case : అక్రమాస్తుల కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడికి మద్రాస్ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 50లక్షల జరిమానా సైతం విధించింది. 2006 నుంచి 2011 వరకూ మంత్రిగా ఉన్న పొన్ముడి రూ.1.36 కోట్లు అక్రమాస్తులను కూటబెట్టారనే కేసులో పొన్ముడితో పాటు ఆయన భార్య విశాలాక్షిని మద్రాస్ హైకోర్టు ఈనెల 19న దోషిగా తేల్చింది. ఇదే కేసు నుంచి వారిద్దరికీ విముక్తి కల్పిస్తూ 2016లో దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. గురువారం తీర్పు వెలువరించిన న్యాయమూర్తి పొన్ముడికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో ఆయన సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు హైకోర్టు 30 రోజుల గడువు విధించింది. ఆరు సార్లు ఎమ్మెల్యే, ప్రముఖ విద్యావేత్త అయిన 70ఏళ్ల పొన్నుడికి విల్లుపురం బెల్ట్‌లో రాజకీయంగా మంచి పట్టు ఉంది.
పొన్ముడి బాధ్యతలు మరో మంత్రికి బదలాయింపు
మద్రాస్ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఆయన తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లకు మించి శిక్ష పడితే చట్ట సభ్యులు తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. దీంతో పాటు శిక్ష పూర్తైన తర్వాత ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు ఉండదు. ఇప్పటికే పొన్ముడి నిర్వహిస్తున్న బాధ్యతలను బదలాయించారు. సీఎం స్టాలిన్ సిఫారసు మేరకు ఉన్నత విద్యా శాఖ బాధ్యతలను బీసీ సంక్షేమ మంత్రి ఆర్ఎస్ రాజకన్నప్పన్‌కు కేటాయిస్తూ రాజ్‌భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.