తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కోసం కేసీఆర్​ను ప్రశ్నించాను: పొంగులేటి

Ponguleti Respond on BRS Suspension: బీఆర్‌ఎస్‌ నుంచి తనను సస్పెండ్ చేయడంపై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కోసం కేసీఆర్‌ ప్రశ్నించానని తెలిపారు. వంద రోజులుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నానని ఆయన వివరించారు.

Ponguleti Srinivas Reddy
Ponguleti Srinivas Reddy

By

Published : Apr 10, 2023, 3:50 PM IST

Ponguleti Respond on BRS Suspension: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బీఆర్ఎస్‌ పార్టీ సస్పెండ్‌ చేసింది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెన్షన్‌పై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. పార్టీలోకి రావాలని గతంలో మంత్రులు, నాయకులు కోరారని చెప్పారు. పాలేరు ఉపఎన్నిక వేళ పార్టీలో చేరాలని ఒత్తిడి తెచ్చారని వివరించారు. ఖమ్మం జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలంటే.. తాను టీఆర్ఎస్‌లో ఉంటేనే గెలుస్తారని ఒత్తిడి తెచ్చారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌లో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారని తెలిపారు. బంగారు తెలంగాణ సాధనలో తన వంతు చేయూత ఇవ్వాలని కోరారని అన్నారు. సీఎం ఆహ్వానం మేరకు బీఆర్‌ఎస్‌లో చేరానని వివరించారు. నాడు పాలేరు ఉపఎన్నికలో కనీవినీ ఎరుగని రీతిలో గెలిచామని గుర్తు చేశారు.

కేటీఆర్‌ కోసమే తాను బీఆర్‌ఎస్‌లో కొనసాగాను: పార్టీలో చేరిన ఐదు నెలలకే అసలు విషయం అర్థమైందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు పెట్టారని.. అవమానపరిచారని పేర్కొన్నారు. అన్నింటిని దిగమింగుకుని పార్టీలో కొనసాగానని వివరించారు. కేటీఆర్‌ కోసమే తాను బీఆర్‌ఎస్‌లో కొనసాగానని తెలిపారు. గత ఎన్నికల్లో తనకు పార్టీ టికెట్‌ ఇవ్వలేదని అన్నారు. జిల్లాలో ఒకే అభ్యర్థి గెలవడానికి కారణమేంటని విశ్లేషించుకోలేదని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

నిందలు మోపడం ఎంతవరకు సమంజసం: ఫలితాలు వచ్చాక నిందలు మోపడం ఎంతవరకు సమంజసమని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఓడిన వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మి అవమానపరిచారని వ్యాఖ్యానించారు. తనకు అన్యాయం జరిగినా ఓపిక పట్టానని తెలిపారు. తన టికెట్‌ మరొకరికి ఇచ్చి.. ఆ వ్యక్తి గెలుపు కోసం కష్టపడాలని కోరారని చెప్పారు. పార్టీ కోసం కష్టపడి ఎంపీ అభ్యర్థిని గెలిపించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మీకు గెలిచే సత్తా ఉంటే తనను ఎందుకు ప్రాధేయపడ్డారని పేర్కొన్నారు. రెండోసారి మోసం చేసిన మాట ముమ్మాటికీ నిజమని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

"బంగారు తెలంగాణ ఇస్తామని నమ్మబలికారు. తెలంగాణ బిడ్డలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినందుకు కృతజ్ఞతలు. నేను పార్టీ సభ్యుడినే కాదని జిల్లా అధ్యక్షుడు తెలిపారు. బీఆర్‌ఎస్‌లో సస్పెన్షన్లు ఉండవని మరో మంత్రి చెప్పారు. మీరే రాజీనామా చేయాలని మరో మంత్రి అన్నారు. నాకు సభ్యత్వమే లేదన్నారు.. సస్పెండ్‌ చేయబోమన్నారు. సభ్యుడిని కానప్పుడు ఎలా సస్పెండ్‌ చేశారో చెప్పాలి. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కోసం కేసీఆర్‌ ప్రశ్నించాను. వంద రోజులుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాను." - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ

తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కోసం కేసీఆర్‌ ప్రశ్నించాను: పొంగులేటి

ఇవీ చదవండి:జూపల్లి, పొంగులేటికి బీఆర్ఎస్ షాక్.. పార్టీ నుంచి సస్పెండ్

ఆ ఇద్దరు నాయకులు ఎవరి ఉచ్చులో చిక్కుకొని ఉన్నారో అందరికీ తెలుసు: నిరంజన్‌రెడ్డి

'అగ్నిపథ్‌'పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. వారికి మాత్రం నో ఛాన్స్​!

ABOUT THE AUTHOR

...view details