Ponguleti and Jupally Latest Comments: బీఆర్ఎస్ నుంచి సస్పెండ్‌కు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తమ గూటికి చేర్చేందుకు బీజేపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కమలం అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్‌షా ఆదేశాల మేరకు ఖమ్మంలో పొంగులేటి నివాసంలో జూపల్లి కృష్ణారావు, శ్రీనివాసరెడ్డితో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, రఘునందన్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి సమావేశమయ్యారు. ఐదు గంటలకుపైగా సుదీర్ఘంగా చర్చించిన నేతలు.. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీలో చేరికపై మథనం చేశారు.
కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించడమే ధ్యేయం: ఈ సందర్భంగా బీజేపీలోకి రమ్మని ఆ పార్టీ నేతలు ఆహ్వానించినప్పటికీ.. ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి సమావేశాలు చాలా జరుగుతాయని.. ఇది మొదటిదేనన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. తెలంగాణ ప్రజల అందరి మనోభావాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించడమే అందరి ఉమ్మడి ధ్యేయమన్న నేతలు.. అందుకు తగ్గ సరైన మార్గాన్ని అనేక సంప్రదింపుల తర్వాత ఎంచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.
'తెలంగాణ రాష్ట్రమొస్తే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని కలలు కన్న తెలంగాణ బిడ్డల ఆశయాన్ని సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారు. వ్యక్తిగత స్వార్థం కోసం పరిపాలన చేస్తున్న సీఎం కేసీఆర్‌ను గద్దె దించే అంశంలో అందరం ఏకం కావాలి. ఇదే విషయాన్ని అనేక వేదికలపై చెప్పాను. బీజేపీ ముఖ్య నాయకులతో చర్చల సందర్భంగా కూడా ఇదే విషయం చెప్పాం. ఏ లక్ష్యంతో తెలంగాణ బిడ్డలకు అండగా ఉండాలని బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చామో.. ఆ ఆశయం నెరవేర్చే క్రమంలోనే ఈనాటి సమావేశం. భవిష్యత్‌లో జరగబోయే సమావేశాలు. కేసీఆర్‌ను గద్దె దించడమే మా అందరి లక్ష్యం. తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయి.'- పొంగులేటి