Pond Stolen In Bihar :బిహార్లో మరో అసాధారణ ఘటన జరిగింది. దర్భంగా జిల్లాలో రాత్రికి రాత్రే ఓ చెరువు మాయమైంది. చెరువు స్థానంలో ఓ గుడిసె వెలిసింది. ఈ వింత ఘటనతో స్థానికులు అవాక్కయ్యారు.
దర్భంగా జిల్లాలో ఇటీవల భూముల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ల్యాండ్ మాఫియా గతంలోనే ఈ చెరువుపై కన్నేసింది. ఓసారి ఈ చెరువును కబ్జా చేసేందుకు సైతం ప్రయత్నాలు చేశారు. అప్పుడు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొన్నాళ్ల పాటు కబ్జా ప్రయత్నాలు ఆగిపోయాయి. అయితే, ఆదివారం ఉదయం చూసేసరికి ఆ ప్రాంతంలో చెరువు కనిపించలేదు. చెరువు స్థానంలో ఓ గుడిసె ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
చేపల వేటకు వినియోగం
ఈ చెరువును స్థానికులు చేపల వేట కోసం ఎక్కువగా ఉపయోగించుకునేవారు. అలాంటిది ప్రస్తుతం ఆ చోట చెరువు ఆనవాళ్లు ఏమాత్రం కనిపించడం లేదు. చెరువును మట్టితో నింపి, పైన ఓ గుడిసె ఏర్పాటు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే, పోలీసులు వచ్చే లోపే మాఫియా ముఠా అక్కడి నుంచి పారిపోయింది. అర్ధరాత్రి సమయంలో ట్రక్కులతో మట్టిని తీసుకొచ్చి చెరువును పూర్తిగా నింపేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.