భరతనాట్యం చేస్తూ నిమిషాల్లో పుణ్య క్షేత్రాలను అధిరోహిస్తున్న కళాకారుడు Bharatanatyam artist climbing Tirumala hill while dancing: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాకు చెందిన ఓ యువ కళాకారుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువై ఉన్న ఆ శ్రీవారి దర్శనం కోసం.. నృత్యం చేస్తూ సునాయాసంగా వేలాది మెట్లు ఎక్కేస్తున్నాడు. సామాన్య భక్తులు.. 2 గంటల నుంచి 3 గంటల్లో తిరుమలకు చేరుకుంటుంటే.. ఆ యువ కళాకారుడు మాత్రం నాట్యం చేసుకుంటూ.. 75 నిమిషాల్లో తిరుమల చేరుకుంటున్నాడు. ఓ వైపు అధ్యాపకుడిగా, మరోవైపు శిక్షణకారుడిగా విధులు నిర్వరిస్తూ.. వివిధ పోటీల్లో ప్రదర్శనలిస్తూ.. అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. మరి ఎవరా ఆ యువ కళాకారుడు..? అతని విద్యాభ్యాసం ఏంటి..? నాట్యం చేస్తూ తిరుమల మెట్లెందుకు ఎక్కుతున్నాడు..? అతడి లక్ష్యం ఏంటి..? అనే వివరాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం..
భరతనాట్యంలో రాణిిస్తున్న పల్నాడు వాసి..తిరుమలలో కొలువై ఉన్న శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అందులో మొక్కుబడులను తీర్చుకునేవారు కొందరైతే.. కాలినడకన వెళ్తే పుణ్యం, కోరుకున్న కోరికలు సిద్ధిస్తాయని నమ్మేవారు మరికొందరు. కానీ, పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన భరతనాట్య కళాకారుడు డాక్టర్. పి కృష్ణవాసు శ్రీకాంత్ మాత్రం సునాయాసంగా కొండల్ని, పర్వతాల్ని ఎక్కేస్తూ అవార్డులు, ప్రశంసలు అందుకుంటున్నాడు.
సంస్కృత భాషలో పీహెచ్డీ పూర్తి చేసిన కళాకారుడు..శ్రీకాంత్ తండ్రి పోలూరి రామారావు తబలా కళాకారుడు కాగా.. తల్లి లక్ష్మీ వయోలిన్ కళాకారిణి. చిన్నతనంలో సోదరి వద్ద నాట్యంలో ఓనమాలు చేర్చుకున్న శ్రీకాంత్.. ఆమె స్ఫూర్తితోనే కళాకారుడిగా ఎదిగాడు. తిరుపతి ఎస్వీ సంగీత, నాట్య కళాశాలలో నాలుగేళ్ల కోర్సు పూర్తి చేశాడు. సంస్కృత భాషపై ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేశాడు. వేద పాఠశాలలో సంస్కృత అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తూనే.. ప్రతిరోజు సాయంత్రం వేళ తన ఇంటి వద్ద చిన్నారులకు భరతనాట్యంలో శిక్షణ ఇస్తున్నాడు. వివిధ పోటీల్లో ప్రదర్శనలిచ్చి ఉత్తమకళాకారులుగా ఎదిగేందుకు తన వంతు సాయం చేస్తున్నాడు.
కళాకారుడు శ్రీకాంత్ లక్ష్యం ఇదేనట.. ఈ క్రమంలో భరతనాట్యం లాంటి నృత్యాలను ఈతరానికి చేరువ చేసి.. వారిని శారీరకంగా, మానసికంగా దృఢంగా మార్చటమే తన లక్ష్యమంటున్నాడు.. పల్నాడు జిల్లాకు చెందిన యువ కళాకారుడు పోలూరి కృష్ణవాసు శ్రీకాంత్. ఇందుకోసం నాట్యం చేస్తూ కొండలు ఎక్కడం అనే వినూత్న కార్యక్రమాన్ని వారధిగా ఎంచుకున్నానని పేర్కొంటున్నాడు.
కొండల్ని, పర్వతాల్ని వేదికలుగా ఎంచుకున్న శ్రీకాంత్.. శాస్త్రీయ కళలకు చిరునామా అయిన మన భారతదేశంలో.. భరతనాట్యం, కూచిపూడి లాంటి నృత్యాల్ని వివిధ సాంస్కృతిక, కళా వేదికలపై తరచుగా కళాకారులు ప్రదర్శించడం చూస్తూనే ఉంటాం. కానీ, నాట్యం చేసేందుకు కొండల్ని, పర్వతాల్ని వేదికగా మలుచుకుని శ్రీకాంత్ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. నరసరావుపేటకు చెందిన ఈ 35 ఏళ్ల కళాకారుడు.. మెట్ల మార్గంలో నాట్యం చేస్తూ కొండల్ని అధిరోహిస్తున్నాడు. శాస్త్రీయ కళల్ని నేటి తరానికి చేరువ చేయాలనే బలమైన సంకల్పమే ఈ వినూత్న ప్రయత్నానికి నాంది పలికిందంటున్నాడు. అందులో భాగంగానే భరతనాట్యం చేస్తూ.. శ్రీవారి మెట్ల నడక మార్గంలో తిరుమలకు చేరుకుంటున్నాడు.
75 నిమిషాల్లో తిరుమల మెట్లెక్కిన శ్రీకాంత్.. సాధారణంగా భక్తులకు శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమల చేరుకునేందుకు సుమారు 2 గంటల నుంచి 3 గంటల సమయం పడుతోంది. కానీ, శ్రీకాంత్ భరతనాట్యం చేసుకుంటూ.. 75 నిమిషాల్లో తిరుమల చేరుకున్నాడు. నాట్యం చేస్తున్న సమయంలో.. అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలు పఠనం చేస్తూ శ్రీవారి భక్తులకు, పర్యాటకులకు శాస్త్రీయ నాట్యంపై ఆసక్తి కలిగిస్తున్నాడు. కోటప్పకొండలో నడిచే వేద పాఠశాలలో సంస్కృత అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్.. తన నాట్య సాధనకు త్రికోటేశ్వర పర్వతాన్ని వారధిగా ఎంచుకుని.. నిత్యం కింద నుంచి కొండపైకి నాట్యం చేసే సాధనను ప్రారంభించాడు. తక్కువ సమయంలో వేగంగా కొండను ఎక్కడంలో ప్రావీణ్యం సంపాదించాడు.
15 నిమిషాల్లోనే కోటప్పకొండ..శ్రీకాంత్.. ఇప్పటికే మన రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల, సింహచలం, కోటప్పకొండ, శివగిరి క్షేత్రాల్ని నాట్యం చేస్తూ అధిరోహించాడు. సింహచలం, కోటప్పకొండను కేవలం 15 నిమిషాల్లోనే నాట్యం చేస్తూ ఎక్కాడు. ఈ నాట్య సాధన వల్ల ఏకాగ్రత మరింత పెరిగిందంటున్న శ్రీకాంత్.. భరతనాట్యం నేర్చుకోనేందుకు విద్యార్థులు, యువత సైతం ముందుకు వస్తున్నారని తెలిపారు.
ఇలా చేస్తే చక్కటి విజయాలు సాధిస్తారు.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు విద్యతో పాటు సంగీతం, నాట్యం, క్రీడల్లో ప్రావీణ్యం పొందేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని శ్రీకాంత్ సూచిస్తున్నారు. శాస్త్రీయ కళలు అనేవి విద్యార్థులు, యువత జీవితంలో భాగమయ్యేలా ప్రభుత్వాలు, పాలకులు చర్యలు తీసుకుంటే.. మానసిక ఒత్తిడిని అధిగమించి చక్కటి విజయాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.