అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేరళ రాజకీయాల్లో మరింత వేడి రాజుకుంటోంది. అధికార-ప్రతిపక్షాలు ఆరోపణలు-ప్రత్యారోపణల మధ్య త్వరలో జరిగే ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. కేరళలో బోగస్ ఓట్లను సృష్టించి విజయం సాధించాలని అధికార కూటమి ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తుండగా.. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకొని తమను అభాసుపాలు చేసేందుకు యూడీఎఫ్, భాజపా ప్రయత్నిస్తున్నట్లు ఎల్‌డీఎఫ్ ఆరోపిస్తుంది. నకిలీ ఓట్లు, ఐటీ, ఈడీ దాడుల మధ్య కేరళ రాజకీయం మునుపెన్నడూ లేనంత రక్తికట్టిస్తున్నాయి.
నకిలీ ఓట్లు..
కేరళలో ఎక్కువ సంఖ్యలో.. నకిలీ ఓట్లను సృష్టించి అధికార ఎల్‌డీఎఫ్ విజయం సాధించాలని చూస్తోందని.. ప్రతిపక్ష కాంగ్రెస్-యూడీఎఫ్ కూటమి ఆరోపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలు కలిపి 4 లక్షల నకిలీ ఓట్లు ఉన్నట్లు విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై నిజానిజాలు తేల్చేందుకు విపక్ష కాంగ్రెస్, యూడీఎఫ్ కూటమి హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. విపక్ష నేత రమేశ్ చెన్నితాల దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో.. నకిలీ ఓట్ల ద్వారా అధికార ఎల్‌డీఎఫ్ తిరిగి అధికారం చేపట్టేలా ప్రభుత్వ ఉన్నాతాధికారులు సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. నకిలీ ఓట్లపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను అధికార ఎల్‌డీఎఫ్ ఖండించింది. ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పింది.
ఇదీ చదవండి:'ఇది దేశ ప్రతిష్ఠను దిగజార్చే ఘటన'
ఇదీ చదవండి:కేరళలో కామ్రేడ్ల నోట శబరిమల మాట