ఎక్కడైనా ఎన్నికలనగానే రాజకీయ నాయకులు ప్రజల చుట్టూ ప్రదక్షిణ చేయటం ఆరంభిస్తారు. గుజరాత్‌లో మాత్రం ప్రజలతో పాటు గోవులు, పశువుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ప్రజల్లో గోవులకున్న గౌరవానికి తోడు.. పశువుల్ని సాకే మాల్దారీ వర్గం ఓట్లను ఆకర్షించటానికి పార్టీలు ఆపసోపాలు పడుతున్నాయి.ప్రజలు గోమాతగా పూజించే ఆవును కాదని గుజరాత్‌లో ఏ పార్టీ ముందుకు వెళ్లలేని పరిస్థితి.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నుంచి మొదలెడితే గల్లీ నాయకుడి దాకా అంతా గో ప్రదక్షిణ చేస్తున్నారు. పోటీపడి మరీ గోవుల కోసం, పశు సంరక్షణ కోసం హామీలు, తాయిలాలు ప్రకటిస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన ‘ముఖ్యమంత్రి గోమాత పోషణ యోజన’ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద గోశాలల నిర్వహణ, గోవుల సంరక్షణ కోసం రూ.500 కోట్లను కేటాయించారు. తమ గత బడ్జెట్‌ను గోపక్షపాత బడ్జెట్‌గా ముఖ్యమంత్రి భూపేంద్రపటేల్ అభివర్ణించుకోవటం విశేషం.
ఇన్నాళ్లూ లౌకిక ముద్ర కోసమని గోవు అనే పదం వాడకుండా... జంతు పరిరక్షణ అంటూ మాట్లాడుతూ వచ్చిన కాంగ్రెస్ కూడా తొలిసారిగా ఈదఫా గోవుల గురించి మేనిఫెస్టోలో ప్రస్తావించింది. రాజస్థాన్ తరహాలో.. పాలపై లీటరుకు రూ.5 సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా రాష్ట్రంలో గోశాలలను పునర్‌నిర్మిస్తామని, గోవులను రక్షించటానికి మరింతమంది పశువైద్యులను నియమిస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల్లో నెగ్గటం కోసం కాకుండా గోవులను సంరక్షించాలనే సదుద్దేశంతో ఈ హామీ ఇస్తున్నట్లు కాంగ్రెస్ ప్రత్యేకంగా పేర్కొనటం గమనార్హం. ఇక ఆమ్ ఆద్మీపార్టీ హామీల్లో మరో అడుగు ముందుకు వేసింది. గుజరాత్‌లో తాము అధికారంలోకి వస్తే ప్రతి ఆవుకు రోజుకు రూ.40 చొప్పున నిర్వహణ ఖర్చుల కింద చెల్లిస్తామని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రకటించారు.