తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లి కాని ప్రసాద్​ ప్రేమ ఎన్నికలు! - పెళ్లి కోసం తిప్పలు

Politician Marriage Proposal : ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. అలా జరగకపోతే ఏమవుతుంది? పెళ్లి కాని ప్రసాద్​కు వచ్చిన తిప్పలు వస్తాయి. బ్రహ్మచర్యంతో బ్రహ్మముడి పడుతుంది. బ్యాచిలర్​ బతుకే దిక్కవుతుంది. అమ్మో ఆ ఊహే వద్దంటున్నాడు మన ప్రసాద్​. పెళ్లి కూతురు వేటలో ప్రచారం ముమ్మరం చేశాడు. ఇంతకీ ఆ వధువు వేటలో చివరకు ఎన్ని మలపులు చోటు చేసుకున్నాయో.. చూద్దాం.

politician_marriage_proposal
politician_marriage_proposal

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 3:26 PM IST

Politician Marriage Proposal :పట్టుదలతో ఉన్న రాజకీయ నాయకుడు ప్రతీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసినట్టు.. వయసు ముదిరిన నేనూ పెళ్లి కోసం ఎన్నో ఏళ్లుగా నామినేషన్‌ వేస్తూనే ఉన్నాను. పోటీ చేసే అభ్యర్థిలా అఫిడవిట్లో అన్ని వివరాలూ సమర్పించినట్టే...ఆపసోపాలతో నా అర్హతలన్నీ అచ్చేసి పెళ్లి కూతురు వేట మొదలు పెట్టాను. ఎలాగైనా పదవి దక్కించుకోవడం కోసం నాయకులు పదేపదే పార్టీలు మార్చినట్టు.. పెళ్లి కుదరాలని నేనూ రకరకాల ప్రయత్నాలు చేశాను. పంతులుగారితో మొదలెట్టిన నా కలల రాణి వెదుకులాట మ్యాట్రిమొనీల్లో గాలించేదాకా వచ్చింది..

ఆ యాప్‌ ఈ యాప్‌ అనకుండా అన్నిచోట్లా అమ్మాయిని వెతికాను. అయినా ఎంత ప్రయత్నించినా నామినేషన్‌ చెల్లని అభ్యర్థిగానే మిగిలిపోతున్నాను. ఆఖరికి ఎవరో ఓ అనామక అభ్యర్థి జాక్‌పాట్‌ కొట్టి, పార్టీ టికెట్‌ దక్కించుకున్నట్టు.. నాకో అందాలరాశితో సంబంధం కుదిరే అవకాశం వచ్చింది. ఈసారి లక్కీఛాన్స్‌ వదులుకోవద్దని అన్ని కోణాల్లో మోహరించాను. హామీల తాయిలాలతో కాబోయే అత్తమామలను మెప్పించి బుట్టలో వేసుకున్నాను. ప్రలోభాలతో తన అన్నదమ్ముల్ని నావైపు తిప్పుకున్నాను. నాకు మద్దతు ఇస్తే.. మీ భవిష్యత్ బంగారమే అన్న నమ్మకాన్ని కలిగించాను. ఆమెను నాకు దక్కేలా చేస్తే తనను కాలుకింద పెట్టనీయకుండా మహా రాణిలా చూసుకుంటానని, తన కోసం చాలా చేస్తానని బంధువులందరిని హామీల వర్షంలో తడిపి ముద్ద చేశాను. ఎట్టకేలకు ప్రత్యర్ధులు, ప్రతికూల పరిస్థితులు లేకుండా అన్ని ఈక్వేషన్లూ కుదిరి మా పెళ్లి చూపులు ఘనంగా జరిగాయి.

Pellikani Prasad Prema Ennikalu : అంతా సవ్యంగా సాగుతుంది అనుకొని బలమైన పార్టీ వేవ్‌లో సులువుగా నెగ్గే అభ్యర్థిలా నిశ్చింతగా ఉన్నాను. ఫలితాలు ప్రకటించే సమయంలా నా పెళ్లిరోజు రానే వచ్చింది. మూడు ముళ్లు పడే సమయానికి ఎక్కన్నుంచి వచ్చాడో గానీ అకస్మాత్తుగా ఒకడు ఊడిపడ్డాడు. కౌంటింగ్ సెంటర్​లో విజయం దక్కినట్టే ప్రత్యర్ధి వైపు ఓటింగ్ మళ్లుతుందేమోనన్న భయం నాలో కలిగింది. అనుకున్నట్లే, ఆఖరి రౌండ్లో ఫలితం తారుమారైనట్టు.. వాడొచ్చి నా కాబోయే భార్యని పెళ్లి పీటల మీద నుంచి పక్కకి తీసుకెళ్లిపోయాడు. మా ఇద్దరిదీ ఒక పార్టీకి, ఆ పార్టీ గుర్తుకి ఉన్నంత గాఢమైన అనుబంధం’ అంటూ అందరిముందూ ప్రచారం చేసేశాడు. లక్ష మెజారిటీతో గెలుస్తా అనుకున్న వాడికి, డిపాజిట్‌ గల్లంతైతే ఎలా ఉంటుందో.. అలాగైంది నా పరిస్థితి. రాత్రికి రాత్రే పార్టీ ఫిరాయించిన నాయకుడిలా.. ‘ఏదో లోకంలో ఉండి నీకు ఓకే చెప్పానుగానీ.. నేను ప్రేమించింది ఇతగాడినే’ అంటూ మాట మార్చేసింది నా కలల బుట్టబొమ్మ. దాంతో అసెంబ్లీలో అడుగుపెట్టి ‘అధ్యక్షా..’ అంటూ గొంతెత్తాలని కలలు కన్న ఆశావహుడి కలలు కల్లలైనట్టు నా ఆశలు ఆవిరయ్యాయి. ఎమ్మెల్యేగా ఎన్నికై, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయాలనుకున్న వాడికి, నీ ఎన్నికే చెల్లదంటూ న్యాయస్థానం తీర్పు చెబితే ఎంత బాధ ఉంటుందో.. అంతలా డీలా పడిపోయాను. అయినా.. ఓటు అనే ఆయుధంతో రాజకీయాల కుళ్లు కడిగేయాలని కంకణం కట్టుకున్న ఓటరులా.. నా పెళ్లి కోసం మళ్లీమళ్లీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. అయితే, ఈ సారి నా పోరు బాటను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఏ పార్టీ అండ లేకుండా స్వతంత్ర అభ్యర్థి ప్రయత్నించినట్టు... ఇక నుంచి నేనూ ఏ పంతులునీ నమ్మకుండా ఏ యాప్​కీ లొంగకుండా నా లక్కీ లేడి కోసం టెలిస్కోప్​తో గాలిస్తాను.

ఇట్లు

పెళ్లి కాని ప్రసాద్​ల సంఘం నుంచి ఓ ప్రేమికుడు

ABOUT THE AUTHOR

...view details