- బంగాల్లో భాజపా రెండంకెలు దాటడం గగనమే.
- 99 కంటే ఒక్క స్థానం ఎక్కువ గెలిచినా..నేను ట్విట్టర్ నుంచి తప్పుకుంటా.
ఇవి బంగాల్ ఎన్నికలకు ముందు.. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిశోర్ చెప్పిన మాటలు.
ఆయన అనుకున్నదే జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ- హోం మంత్రి అమిత్ షా మాయ పనిచేయలేదు. ఈ రాజకీయ ఉద్ధండులకే సవాల్ విసిరి బంగాల్లో పైచేయి సాధించారు. దీని వెనుక కీలకంగా వ్యవహరించింది ఐ-ప్యాక్.
ఐ-ప్యాక్.. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ. ఇదో ప్రైవేటు సంస్థ. ప్రశాంత్ కిషోరే దీని అధిపతి. ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎదుర్కొనేలా ఆయా పార్టీలకు బలమైన వ్యూహాలు రచించడంలో పీకే దిట్ట. ఇప్పుడు.. తృణమూల్ కాంగ్రెస్ విజయంలోనూ ప్రశాంత్ కిశోర్, ఆయన సంస్థ ఐ-ప్యాక్ పాత్రే కీలకం.
అంతకుముందూ పలు రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మ్యాజిక్ చూపిన పీకే.. బంగాల్‌లోనూ అదే పునరావృతం చేశారు.
2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి రావడానికి ఆయనే కీలక సూత్రధారి.
తెరవెనుక వ్యూహాలతో..
ఓ వైపు బంగాల్లో అభివృద్ధి, జాతీయ సమస్యలు, దేశ భద్రత, పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలతో ప్రధాన ప్రత్యర్థి భాజపా బరిలోకి దిగితే.. స్థానిక అంశాలు, ఔట్ సైడర్స్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతోనే తృణమూల్ కాంగ్రెస్ తన ప్రచారాన్ని సాగించింది.
తృణమూల్ కాంగ్రెస్ ప్రచారాన్ని సామాన్యులకు మరింత చేరువ చేసేందుకు విస్తృతంగా పనిచేసింది ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐ-ప్యాక్. ప్రచార నినాదాలు, ఏ ప్రాంతంలో ఏ అంశాలపై దృష్టిపెట్టాలి, డిజిటల్ ప్రచారం ఎలా సాగాలి వంటి విషయాల్లో కీలక సూచనలు చేసింది. ఐ-ప్యాక్ సలహాలు పాటిస్తూ.. అభివృద్ధి-సంక్షేమ మంత్రంతో 'దీదీ' సేన సాగించిన ప్రచారం... టీఎంసీకి మరోమారు అఖండ విజయాన్ని కట్టబెట్టింది.
ఏమిటీ ఐ-ప్యాక్?
ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులకు తగినట్లు రాజకీయ వ్యూహాలు రచించే సంస్థగా ఐ-ప్యాక్‌కు మంచి పేరుంది. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలకు సలహాలు, సూచనలు అందిస్తుంది. 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ సంస్థ అప్రతిహత విజయాలతో దూసుకెళ్తోంది.
2014 సార్వత్రికంలో నరేంద్రమోదీ ప్రచార సరళిని ఈ సంస్థే రూపొందించింది. ఎన్డీఏ ప్రభంజనంలో భాగమైంది.
2015 బిహార్ ఎన్నికల్లో నితీశ్ కుమార్(జేడీయూ), 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్ సింగ్(కాంగ్రెస్), 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి(వైఎస్ఆర్సీపీ) ముఖ్యమంత్రులు కావడంలో ముఖ్య పాత్ర పోషించింది ఐ-ప్యాక్.
ఇప్పుడు మళ్లీ 2022 అసెంబ్లీ ఎన్నికల కోసం కూడా అమరీందర్ సింగ్.. తన ప్రధాన సలహాదారుగా ప్రశాంత్ కిశోర్‌ను నియమించుకున్నారు.