రెమ్‌డెసివిర్ ఔషధ సరఫరాలో భారతీయ జనతా పార్టీ 'జోక్యం' చేసుకుంటోందన్న ఆరోపణ మహారాష్ట్ర, గుజరాత్‌లలో తీవ్ర దుమారం రేపుతోంది. కరోనాపై పోరులో విషమంగా ఉన్న రోగులకు ఈ ఔషధాన్ని ఇస్తారు. దేశీయ అవసరాల దృష్ట్యా రెమ్‌డెసివిర్ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
ఇలాంటి సమయంలో దమన్‌కు చెందిన బ్రూక్ ఫార్మా సంస్థ 60 వేల రెమ్‌డెసివిర్ వయల్స్‌ను నిల్వచేసి, ఎగుమతి చేస్తోందన్న సమాచారంతో ముంబయి పోలీసులు విచారణ చేపట్టారు. సంస్థ అధినేత రాజేశ్ డొకానియాను శనివారం రాత్రి పోలీసులు ప్రశ్నించారు. మహారాష్ట్రలో రెమ్‌డెసివిర్ సరఫరాపై ఈ సంస్థతో భాజపా సంప్రదింపులు జరుపుతోంది. దీంతో అది రాజకీయ రగడకు కారణమైంది.
డొకానియాను ప్రశ్నించడంపై హుటాహుటిన పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, భాజపా నేతలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం చౌకబారు రాజకీయం చేస్తోందని ఫడణవీస్ విమర్శించారు.
"కొవిడ్‌పై పోరాటం జరుగుతోంది. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం సిగ్గులేని చర్యలకు పాల్పడుతోంది. బ్రూక్ ఫార్మా అధినేతను అదుపులోకి తీసుకున్నారు. ఆ సంస్థ అదివరకే మహారాష్ట్ర సర్కారు, దమన్ అధికారుల నుంచి అనుమతులు తీసుకుంది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా మహారాష్ట్రకు వీలైనన్ని ఎక్కువ వయల్స్ అందించాలని సంస్థను కోరారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతోంది."
- ఫడణవీస్, మహారాష్ట్ర మాజీ సీఎం
ప్రభుత్వానికి బదులు పార్టీ..
అయితే, రెమ్‌డెసివిర్‌ను ప్రభుత్వ యంత్రాంగమే సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఔషధం కొరతపై పలు రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందుతోన్న వేళ.. 'దానం' చేయడానికి ఒక పార్టీ హోదాలో భాజపా దానిని సేకరించిందన్న ఆరోపణ వివాదాస్పదంగా మారింది.
కొద్ది రోజుల క్రితం.. భాజపా గుజరాత్ విభాగం రెమ్‌డెసివిర్‌ను ఉచితంగా పంచింది. మరో ఘటనలో నాగ్‌పుర్ కోసం సన్‌ఫార్మా నుంచి 10 వేల వయల్స్‌ను సేకరించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.
కరోనా రెండో దశ ఉద్ధృతి తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెమ్‌డెసివిర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. దాని ఎగుమతిదారుల్లో భారత్‌కు చెందిన బ్రూక్ ఫార్మా అతిపెద్ద సంస్థ.
భాజపా తీరుపై అసహనం..
భాజపా జోక్యంపై మహారాష్ట్ర హోంమంత్రి దిలిప్ వాల్సే పాటిల్ మండిపడ్డారు. పోలీసు విధుల్లో భాజపా కలుగజేసుకుంటోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలను సహించబోయేది లేదన్న ఆయన.. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని చెప్పారు.
మానవత్వ వ్యతిరేక చర్య..