దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విలయతాండవం చేస్తోంది. మునుపటి కంటే వేగంగా వృద్ధి చెందుతూ జనాల్లో భయ ప్రకంపనలు రేపుతోంది. బుధవారం ఒక్కరోజే దేశంలో అత్యధికంగా 2 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కావటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే.. ఇంతటి స్థాయిలో వైరస్ ఉగ్రరూపం దాల్చడంపై ఎన్‌టీఏజీఐ(జాతీయ ఇమ్యునేజేషన్ సాంకేతిక సలహా బృందం) ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కే ఆరోడా ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార ర్యాలీలు, మతపరమైన సామూహిక కార్యక్రమాలు, రైతుల ఆందోళన వంటివి మహమ్మారి ఉద్ధృతికి సూపర్ స్ప్రెడర్స్ అని పేర్కొన్నారు. ఏ చిన్న, పెద్ద సామూహిక కార్యక్రమమైనా వైరస్ వ్యాప్తికి సూపర్ స్ప్రెడరేనని తేల్చిచెప్పారు. బుధవారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు.
"కొవిడ్ వ్యాప్తిని పట్టించుకోకుండా కొంతమంది యువత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రూపులు కడుతూ పార్టీలు చేసుకుంటున్నారు. బహిరంగ సమావేశాలతో సహా వీటన్నింటిని ఆపకుంటే పరిస్థితి మరింత తీవ్రంగా మరే అవకాశం లేకపోలేదు."
-డాక్టర్ ఎన్‌కే ఆరోడా, ఎన్‌టీఏజీఐ ఛైర్మన్