తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈసీ ఎన్నికల షెడ్యూల్​పై ఏ పార్టీలు ఏమన్నాయంటే? - కాంగ్రెస్ ఐదు రాష్ట్రాల ఎన్నికలు

5 States election schedule: ఎన్నికల సంఘం విడుదల చేసిన ఐదు రాష్ట్రాల పోలింగ్ షెడ్యూల్​ను ప్రధాన పార్టీలు స్వాగతించాయి. ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాయి. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు దక్కేలా చూడాలని కాంగ్రెస్, సమాజ్​వాదీ పార్టీలు.. ఈసీని కోరాయి.

Assembly poll schedules political parties reaction
Assembly poll schedules political parties reaction

By

Published : Jan 8, 2022, 8:31 PM IST

5 States election schedule: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం పోలింగ్ షెడ్యూల్​ను విడుదల చేసిన తర్వాత స్పందించిన ఆయన.. ప్రజలు మరోసారి భాజపాను దీవిస్తారని అన్నారు. భాజపా అధికారంలోకి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలను నూతన శిఖరాలకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు.

BJP on election Schedule

"ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్​ను స్వాగతిస్తున్నాం. భారీ స్థాయిలో జరిగే ఈ ప్రజాస్వామ్య పండగలో భాజపా కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొనాలి. కొవిడ్ నిబంధనలను, ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను అందరూ పాటించాలి."

-జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు

ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో భాజపా బలంగా పోరాడుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పేర్కొన్నారు. భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.

Yogi Adityanath tweet Election schedule

ప్రజాస్వామ్య పండగను ఆహ్వానిస్తున్నామంటూ ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. ప్రజల ఆశీర్వాదంతో, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సాధించిన ఘనతలతో ఉత్తర్​ప్రదేశ్​లో మరోసారి అధికారంలోకి వస్తామని అన్నారు. అత్యధిక మెజారిటీతో ఎన్నికలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

'భాజపాకు చరమగీతం పాడే ఛాన్స్'

Congress on 5 States Election Schedule: ఎన్నికల తేదీలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. భాజపాను ఓడించి.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, దళితులు, మహిళలపై అకృత్యాలకు చరమగీతం పాడే అవకాశం ప్రజలకు లభించిందని పేర్కొంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ బలంగా పోరాడుతుందని కాంగ్రెస్ ముఖ్య ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా స్పష్టం చేశారు. పంజాబ్​లో మరోసారి అధికారంలోకి వస్తామని, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో భాజపాను గద్దె దించుతామని ధీమా వ్యక్తం చేశారు. యూపీ, గోవా, మణిపుర్, ఉత్తరాఖండ్​లలో భాజపా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం.. రెండింతలు విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలకు సమాన అవకాశం దక్కేలా చూడాలని ఈసీని కోరారు.

"రైతు వ్యతిరేక పార్టీ అయిన భాజపాను ఓడించేందుకు ప్రజలకు ఇదే అవకాశం. లఖింపుర్ ఖేరి ఘటనలో ఓ కేంద్ర మంత్రి కొడుకు హస్తం ఉన్నప్పటికీ ఆయన్ను తొలగించకుండా ఉన్న పార్టీని శిక్షించేందుకు రైతులకు ఇదే అవకాశం. భాజపాను, నిరుద్యోగాన్ని ఓడించేందుకు యువతకు లభించిన బంగారు అవకాశమిది."

-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రతినిధి

Samajwadi party UP election: మరోవైపు, ఎన్నికల షెడ్యూల్​పై స్పందించిన సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.. భాజపా ప్రభుత్వానికి వీడ్కోలు పలికేందుకు ఉత్తర్​ప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికల సంఘం పేర్కొన్న నిబంధనలను తమ పార్టీ పూర్తి స్థాయిలో పాటించేలా చూస్తానని హామీ ఇచ్చారు. అయితే, ప్రాంతీయ పార్టీలకూ డిజిటల్ మాధ్యమాల్లో తగిన ప్రాధాన్యం లభించేలా చూడాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. 'కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భాజపా.. తనకు ఉన్న ఆర్థిక బలంతో ఈ మాధ్యమాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు ఈసీ సహకారం అందించాలి. వర్చువల్ ర్యాలీలు నిర్వహించేందుకు మౌలిక సదుపాయాల పరంగా సహాయం చేయాలి' అని కోరారు.

'మార్చి 10న అఖిలేశ్ వచ్చేస్తున్నారు' అంటూ సమాజ్​వాదీ పార్టీ ట్వీట్ చేసింది.

పోటీకి ఆప్ సిద్ధం

ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ జాతీయ కన్వినర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. 'ఎన్నికల తేదీలు వచ్చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధంగా ఉంది' అని హిందీలో ట్వీట్ చేశారు.

మణిపుర్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది.

ఏడు దశల్లో ఎన్నికలు

5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్​ను శనివారం విడుదల చేసింది ఈసీ. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్​లో ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుండగా, మణిపుర్​లో రెండు, పంజాబ్, ఉత్తరాఖండ్ , గోవాలో ఒకే విడతలో ఎన్నికలు జరపనున్నారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. కరోనా నేపథ్యంలో ఈనెల 15 వరకు రాజకీయ యాత్రలు, ర్యాలీలు, పాదయాత్రలపై ఈసీ నిషేధం విధించింది. షెడ్యూల్​కు సంబంధించిన పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ఇదీ చదవండి:ఒమిక్రాన్ వల్లే దేశంలో మూడోవేవ్- ఫిబ్రవరిలో తీవ్రస్థాయికి!

ABOUT THE AUTHOR

...view details