UP election 2022: ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పరిణామాలు రోజురోజుకూ ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. అధికార పక్షానికి షాకిస్తూ భాజపా ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేస్తున్న వేళ... అభ్యర్థుల ఎంపికపై కమలదళం కసరత్తులు ముమ్మరం చేసింది. తొలి మూడు దశలకు జరిగే ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తోంది. అటు, మిగిలిన పార్టీలు సైతం ఈ రేసులో వేగంగా ముందుకెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించింది.
UP election candidate selection:
తొలి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్న 172 అసెంబ్లీ స్థానాలకు భాజపా తన అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సామాజిక స్థితిగతులను, అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకొని జాబితాను రూపొందించినట్లు సమాచారం.
బరిలోకి యోగి..
Yogi Adityanath seat UP election: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం రాష్ట్ర శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన్ను ఈసారి ఎన్నికల బరిలోకి దించాలని భాజపా అధిష్ఠానం యోచిస్తోంది. గోరఖ్‌పుర్ నుంచి ఐదు సార్లు ఎంపీగా ఎన్నికైన యోగిని.. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య నుంచి పోటీకి దింపాలని కమలదళం భావిస్తోంది.
- ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్‌లను శాసనసభకు పంపాలని యోచన.
- సిరాథూ స్థానం నుంచి కేశవ్ ప్రసాద్ మౌర్య, లఖ్‌నవూలోని ఓ నియోజకవర్గానికి దినేశ్ శర్మ పోటీ పడే అవకాశం.
ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే జాబితాను త్వరలోనే అధికారికంగా విడుదల చేయనున్నారు. అయితే, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలా మందికి ఈసారి టికెట్ లభించే అవకాశం లేదని సమాచారం.
మహిళల ఓట్లపై కాంగ్రెస్ కన్ను!
Congress UP election candidate list: అటు, కాంగ్రెస్ ఇప్పటికే తొలి జాబితా విడుదల చేసింది. తొలి నుంచీ 'మహిళా సాధికారత'పై ఆధారపడిన కాంగ్రెస్.. టికెట్ల కేటాయింపులోనూ వారికే పెద్దపీట వేసింది. మహిళలకు 40 శాతం, యువతకు 40 శాతం స్థానాలను రిజర్వ్ చేసి సరికొత్త సమీకరణాలతో ప్రయోగాలు చేస్తోంది. సీఏఏకు వ్యతిరేకంగా పోరాడిన కార్యకర్త, ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి, తమ హక్కుల కోసం గళమెత్తిన ఆశా వర్కర్.. ఇలా వివిధ సామాజిక అంశాలతో వార్తల్లో నిలిచిన వ్యక్తులకు సీట్లు కేటాయించి సానుభూతి పొందాలని భావిస్తోంది.
UP election candidate list 2022
- 125 మంది పేర్లతో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
- 50 సీట్లు మహిళలు, 40 స్థానాలు యువకులకు కేటాయింపు
ఇది చారిత్రక నిర్ణయమని, దీంతో యూపీలో సరికొత్త రాజకీయాలకు తెరలేస్తుందని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చెప్పుకొచ్చారు. 125 మంది జాబితాలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్ సైతం ఉన్నారని ప్రియాంక వెల్లడించారు. గౌరవ వేతనాల కోసం పోరాడిన ఆశా వర్కర్ పూనమ్ పాండే షాజహాన్‌పుర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో న్యాయం కోసం పోరాడిన వ్యక్తులకే కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఇచ్చినట్లు తెలిపారు. మహిళలను ప్రత్యేకమైన ఓటు బ్యాంకుగా భావించడం లేదని అన్నారు. జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళలకు.. రాజకీయాల్లో పాల్గొనే హక్కు ఉందని చెప్పుకొచ్చారు.
గెలిపించిన వ్యూహాన్ని నమ్ముకొని..
BSP UP Election 2022: ఈ ఎన్నికల ప్రచారంలో కాస్త డీలా పడ్డట్టు కనిపిస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఇప్పటికే 300 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. 90 మంది దళితులకు అవకాశం కల్పించినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్ర తెలిపారు. భాజపా, సమాజ్‌వాదీ పార్టీలకు తమ అభ్యర్థులపై విశ్వాసం లేదని, అందుకే జాబితాలను ఇంకా విడుదల చేయలేదని ఆరోపించారు. రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
BSP candidate list UP polls:
- గంగోహ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ సోదరుడు నోమన్ మసూద్ పోటీ
- చర్తవాల్ నియోజకవర్గం నుంచి మాజీ హోంమంత్రి కుమారుడు సల్మాన్ సయీద్
- మాయావతి పుట్టిన రోజు అయిన జనవరి 15న పూర్తి జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు.