భాజపాపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్ర మెహబూబా ముఫ్తీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రతి సమస్యకు ప్రధాన రాజకీయ పార్టీల వైఫల్యం కారణమని భాజపా తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టు ఆరోపించారు. తమ ప్రాంతంలోని రాజకీయ పార్టీలు బలిపశువులుగా మారాయని.. ప్రతి ఒక్కరు తమనే లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
అయితే తమను ఎన్ని మాటలన్నా.. జమ్ముకశ్మీర్ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు ముఫ్తీ. ఈ క్రమంలోనే.. అక్రమంగా రద్దు చేసిన ఆర్టికల్ 370ని పునరుద్ధరించేంత వరకు తమ సుదీర్ఘ రాజకీయ పోరాటం కొనసాగుతుందన్నారు.
"జమ్ముకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు బలిపశువులుగా మారాయి. ఇది ఎంతో బాధాకరం. అందరూ మమ్మల్నే నిందించడానికి చూస్తున్నారు. మేము పాకిస్థాన్‌కు అనుకులమని కేంద్రం చేసే తప్పుడు ప్రచారాలపై పోరాడుతూ ఉంటాం. మేము కశ్మీర్ అభివృద్ధికి వ్యతిరేకమని అందరూ చేసే విమర్శలను ఎదుర్కొంటాం. ఈ ఆరోపణల్లో నిజం లేదు."
-- మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత్రి.
'స్వయం ప్రతిపత్తి కోసం పోరాటం..'