తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉమ్మడి మెదక్ జిల్లాలో మళ్లీ బీఆర్ఎస్ హవానే కొనసాగుతుందా? త్రిముఖ పోరు తప్పదా? - మెదక్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి

Political Parties Heat in Medak District: మెతుకు సీమలో అసెంబ్లీ పోరు.. రసవత్తరంగా సాగుతోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాను కంచుకోటగా మార్చుకున్న భారత రాష్ట్ర సమితికి.. గట్టి పోటీనిచ్చేందుకు కాంగ్రెస్‌ సర్వశక్తులు ఒడ్డుతోంది. మొత్తం 10 నియోజకవర్గాల్లో ఏడు స్థానాల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్‌ మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. గజ్వేల్‌, దుబ్బాకలో అధికార పార్టీతో.. బీజేపీ సై అంటే సై అంటోంది. సీఎం కేసీఆర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్‌లో బీజేపీ సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌ బరిలోకి దిగడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. గత ఎన్నికల మాదిరే బీఆర్ఎస్ హవా ఈసారీ కొనసాగుతుందా..? కాంగ్రెస్‌, బీజేపీ అన్యూహ ఫలితాలతో సత్తా చాటుతాయా..? కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

Political Parties Heat In Medak District
Political Parties Heat

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2023, 10:57 PM IST

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత ఎన్నికల మాదిరే బీఆర్ఎస్ హవా ఈసారీ కొనసాగుతుందా? త్రిముఖ పోరు తప్పదా?

Political Parties Heat in Medak District: ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది, కాంగ్రెస్‌ ఒక చోటా విజయం సాధించాయి. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో వచ్చిన ఉపఎన్నికలో.. బీజేపీ విజయం సాధించింది. ఉద్యమ కాలం నుంచి భారత రాష్ట్ర సమితికి కంచుకోటగా ఉన్న మెతుకుసీమలో.. ఈసారి రసవత్తర పోరాటం జరుగుతోంది. సిద్దిపేట నియోజకవర్గం బీఆర్ఎస్ కంచుకోటగా ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ తర్వాత ఆయన మేనల్లుడు హరీశ్‌రావు ఈ నియోజకవర్గంలో భారీ విజయాలు సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో లక్షలకు పైగా మెజార్టీ సాధించిన మంత్రి హరీశ్‌రావు.. తన రికార్డును తానే తిరగరాయాలనే సంకల్పంతో బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ నుంచి పూజల హరికృష్ణ, బీజేపీ నుంచి దూది శ్రీకాంత్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ హరీశ్‌రావుకు ఎంతమాత్రం పోటీ ఇస్తారో కొద్ది రోజుల్లో తేలనుంది.

Political Heat in Gajwel Constituency : గజ్వేల్‌ నియోజకవర్గంపై రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్​ను వీడి బీజేపీలోకి చేరిన ఈటల రాజేందర్‌.. సీఎంపై పోటీకి నిలవడం గజ్వేల్‌ పోరును రసవత్తరంగా మార్చింది. కాంగ్రెస్‌ నుంచి తూంకుంట నర్సారెడ్డి బరిలో నిలిచారు. మరోసారి గెలుపు నల్లేరుపై నడకే అనుకుని బీఆర్ఎస్ భావిస్తున్న తరుణంలో ఈటల రాజేందర్‌ సవాల్‌ చేసి బరిలోకి దిగడం ఉత్కంఠ రేపుతోంది. గజ్వేల్‌ నియోజకవర్గంలో కీలకంగా ముదిరాజుల ఓట్లతో పాటు బీసీలు తనకే మద్దతిస్తారని ఈటల భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అభివృద్ధి పనులతో గజ్వేల్‌ రూపురేఖల్ని మార్చేశారు. హోరాహోరీ పోరు జరుగుతుందా..? మరోసారి భారీ ఆధిక్యంతో గులాబీ దళపతే విజయం సాధిస్తారా..? అనేది ఎన్నికల ఫలితాలతో తేలిపోనుంది.

Telangana Assembly Elections 2023 :దుబ్బాక నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి హోరాహోరీ తలపడుతున్నారు. 2018లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున విజయం సాధించిన సోలిపేట రామలింగరెడ్డి మరణంతో.. 2020లో ఉపఎన్నికలు వచ్చాయి. రసవత్తరంగా జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని బరిలోకి దింపిన బీఆర్ఎస్.. దుబ్బాకలో మళ్లీ గులాబీ జెండా ఎగుర వేయాలనే పట్టుదలతో ఉంది.

గెలుపుపై ధీమాగా ఉన్న రఘునందన్​రావు :ప్రచారంలో ఉండగా కొత్త ప్రభాకర్‌రెడ్డిపై రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేయడం.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. గాయంతో చికిత్స పొందుతున్న ప్రభాకర్‌రెడ్డి.. అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్‌ వేశారు. నియోజకవర్గంలో క్యాడర్‌ బలంగా ఉండటం, తమ అభ్యర్థిపై జరిగిన దాడితో ప్రజల్లో వచ్చిన సానుభూతి కలిసొస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఉపఎన్నికల్లోనే కాదు.. ఈసారి కూడా తానే గెలుస్తానని రఘునందర్‌రావు ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి సైతం గట్టి పోటీ ఇవ్వాలనే పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు.

Election Heat in Medak Constituency : మెదక్‌ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పద్మా దేవేంద్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మైనంపల్లి రోహిత్‌రావు, బీజేపీ నుంచి పంజా విజయ్‌కుమార్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు.. తన కుమారుడి మెదక్‌ టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో.. గూలాబీ గూటిని వీడి కాంగ్రెస్‌లో చేరారు. చెయ్యి పార్టీ టిక్కెట్‌ దక్కించుకున్న మైనంపల్లి రోహిత్‌రావు బరిలోకి రావడంతో.. మెదక్‌ నియోజకవర్గ పోరు ఆసక్తికరంగా మారింది. పదేళ్ల తన హయంలో జరిగిన అభివృద్ధి పనులు, మెదక్ జిల్లా కేంద్రం కావడం, రైలు సౌకర్యం అందుబాటులోకి రావడం వంటివి పద్మా దేవేందర్‌రెడ్డికి సానుకూలంగా ఉన్నాయి. ఫౌండేషన్‌ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని మైనంపల్లి రోహిత్‌రావు ధీమాతో ఉన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జోరందుకున్న ప్రచారాలు ఇంటింటికి తిరుగుతూ ఓట్లడుగుతున్న నేతలు

పటాన్‌చెరు నియోజకవర్గం ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కాటా శ్రీనివాస్‌గౌడ్‌, బీఆర్ఎస్ అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్‌ పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ టిక్కెట్‌ ఆశించి భంగపడిన నీలం మధు ముదిరాజ్‌ కాంగ్రెస్‌లో చేరి.. తొలుత టిక్కెట్‌ తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కాటా శ్రీనివాస్‌గౌడ్‌.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళన చేశారు. నీలం మధుకు టిక్కెట్‌పై వెనక్కి తగ్గిన అధిష్ఠానం చివరకు కాటా శ్రీనివాస్‌ అభ్యర్థిత్వాన్నే ఖరారు చేసింది.

Political Parties Focus on Telangana Elections :జహీరాబాద్‌ నియోజకవర్గంలో ద్విముఖ పోరు నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్‌ మధ్య హోరాహోరీ జరుగుతోంది. బీజేపీ అభ్యర్థి రామచంద్ర రాజ నరసింహా గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోటీ చేస్తుండగా.. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన చింత ప్రభాకర్‌ ఈసారి కూడా బీఆర్ఎస్ తరఫు నుంచి బరిలో నిలిచారు. సంగారెడ్డిలో డంప్‌యార్డ్‌ లేకపోవడం సహా కొన్ని సమస్యలు జగ్గారెడ్డికి ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. మాస్‌ లీడర్‌ కావడం, ప్రజలకు దగ్గరగా ఉండటం బలాలుగా ఉన్నాయి. చింతా ప్రభాకర్‌ను గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత తాము తీసుకుంటామంటూ హరీశ్‌రావు, కేటీఆర్‌ ప్రచారం చేయడం కలిసిరానున్నాయి.

ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమైన ఆందోల్‌లో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా సీనియర్‌ నేత దామోదర రాజ నర్సింహా, బీజేపీ నుంచి బాబు మోహన్‌ పోటీ పడుతున్నారు. అయితే ఈసారి బీఆర్ఎస్-కాంగ్రెస్‌ మధ్య ప్రధాన పోరు నెలకొంది. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి భూపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి సంజీవరెడ్డి, బీజేపీ నుంచి సంగప్ప బరిలో నిలిచారు. 2016లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మరణంతో వచ్చిన ఉపఎన్నికలో విజయం సాధించిన బీఆర్ఎస్.. 2018లోనూ విజయబావుటా ఎగుర వేసింది.

కాంగ్రెస్​ వర్సెస్​ బీజేపీ : నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి సునీత లక్ష్మారెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి, బీజేపీ నుంచి మురళీయాదవ్ బరిలో ఉన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మదన్‌రెడ్డిని మార్చిన బీఆర్ఎస్ అధిష్ఠానం.. సునీతా లక్ష్మారెడ్డికి అవకాశం ఉంది. 2014, 2018లో భారత రాష్ట్ర సమితి ఇక్కడ విజయ బావుటా ఎగురవేసింది. రెండుసార్లు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిన సునీతా లక్ష్మారెడ్డి.. ఈసారి అధికార పార్టీ అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నర్సాపూర్‌లో హ్యాట్రిక్‌ సాధించాలనే పట్టుదలతో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. కాంగ్రెస్‌, బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.

ప్రచారంలో స్పీడ్ పెంచిన ప్రధాన పార్టీలు - పండుగ రోజు సైతం ఇంటింటికి తిరుగుతున్న నేతలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పొలిటికల్ హీట్ - విజయం వరించేదెవరినో​?

ABOUT THE AUTHOR

...view details