Political leaders Condolence to Senior Actor Chandramohan: హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన టాలీవుడ్ సీనియర్ నటులు చంద్రమోహన్ పార్థివదేహాన్ని ఫిల్మ్‌నగర్‌లోని నివాసానికి తరలించారు. భౌతికకాయాన్ని నేడు, రేపు ఇంట్లోనే ఉంచనున్న కుటుంబసభ్యులు.. సోమవారం మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అమెరికాలో ఉన్న చిన్న కుమార్తె మధుర మీనాక్షి రావాల్సి ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు.
సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత
CM KCR TRIBUTE TO CHANDRAMOHAN : ఇదిలా ఉండగా.. చంద్రమోహన్ మృతి పట్ల సీఎం కేసీఆర్, జగన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటన, దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం... తెలుగు చిత్ర సీమకు తీరనిలోటని ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. చంద్రమోహన్ స్ఫూర్తితో ఎందరో నటీనటులు ఉన్నత స్థాయికి ఎదిగారని, కళామతల్లి ముద్దుబిడ్డగా తెలుగుతో పాటు పలు భాషల్లో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారని ఆయన తెలిపారు. శోకతప్తులైన చంద్రమోహన్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చంద్రమోహన్ - 1000 సినిమాలు చేసి, 100 కోట్లు పోగొట్టుకొని, స్థిరంగా నిలబడి!
చంద్రమోహన్ మరణం బాధాకరమని ఏపీ ముఖ్యమంత్రి జగన్ విచారం వ్యక్తం చేశారు. తొలి సినిమాకే నంది అవార్డును అందుకున్న ఆయన.. తెలుగు, తమిళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. చంద్రమోహన్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించానన్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. నాటి చిత్రాలు మొదలుకొని, నిన్న మొన్నటి చిత్రాల వరకు నటుడిగా వారి ప్రాధాన్యత ఎనలేనిదని కొనియాడారు.