దేశంలో ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ జెండా ఎగిరేస్తే.. ప్రధాని పీఠాన్ని అధిరోహించేందుకు మార్గం సుగమం అయినట్టే! రాష్ట్రంలో 403 అసెంబ్లీ స్థానాలుండటం ఇందుకు కారణం. రాజకీయంగా ఇంత ముఖ్యమైన రాష్ట్రంలో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.(up elections 2022) అసెంబ్లీ సమరానికి ఇప్పటి నుంచే పార్టీలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో అధికార భాజపా వ్యూహాలు రచిస్తుండగా.. కమలదళాన్ని గద్దె దించేందుకు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ సన్నద్ధమవుతున్నాయి. ఈ పరిణామాలతో ఏడాది ముందే ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.
రంగంలోకి భాజపా అగ్రనేతలు...
ఎన్నికలు అనగానే అగ్రనేతలను రంగంలోకి దింపడం కమలదళానికి ఆనవాయతీ. ఈసారీ అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్‌ను రూపొందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలుకుని.. అనేకమంది కేంద్ర మంత్రులు, భాజపా సీనియర్ నేతలు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందుకోసం మెగా ర్యాలీలను ఏర్పాటు చేస్తున్నారు అక్కడి భాజపా నేతలు.(bjp up news)
అసెంబ్లీ సీట్ల పరంగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌ను 6 ప్రాంతాలుగా విభజించింది భాజపా. ప్రతి ప్రాంతానికి ప్రత్యేకంగా మీడియా ఇన్చార్జ్, ప్రతినిధిని ఏర్పాటు చేయనుంది. ప్రతి ప్రాంతంలో ఒకటి చొప్పున.. రాష్ట్రం మొత్తం మీద ప్రధాని మోదీ 30కిపైగా సభలు నిర్వహిస్తారని తెలుస్తోంది. మోదీ పర్యటనల కోసం ప్రత్యేకంగా ఓ బృందాన్నే ఏర్పాటు చేసింది కమలదళం. హోంమంత్రి అమిత్ షా 20కిపైగా ర్యాలీల్లో పాల్గొంటారని సమాచారం.
ఇదీ చూడండి:-అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా భాజపా 'బూత్ విజయ్ అభియాన్'
మోదీకున్న ఆదరణ, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఉన్న ఇమేజ్ను ఉపయోగించుకుని ఎన్నికల్లోకి వెళ్లేందుకు కమలదళ నేతలు సన్నద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ అస్త్రం.. ప్రియాంక!
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలకు.. కాంగ్రెస్ ప్రధాన అస్త్రం ప్రియాంక గాంధీ(priyanka gandhi up news). దేశవ్యాప్తంగా డీలాపడ్డ కాంగ్రెస్.. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించి పుజుకోవాలని ఆశిస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని క్షేత్రస్థాయిలో రంగంలోకి దింపింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రియాంక.. ఇప్పటి నుంచే బిజీబిజీగా గడుపుతున్నారు. ఆలయాలను సందర్శించి, స్థానిక కార్యకర్తలను కలుస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 'కాంగ్రెస్ ప్రగతి యాత్ర'ను చేపట్టాలని నిర్ణయించింది ఆ పార్టీ(congress up news). 12వేల కిలోమీటర్లు సాగే యాత్రతో కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాలకు వెళ్లనున్నారు. యోగి హయాంలో.. రాష్ట్రంలో అవినీతి, నేరాలు, మహిళలపై హింస, నిరుద్యోగం, ఆరోగ్య సేవల్లో లోపాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ యాత్రను ఉపయోగించుకోనుంది కాంగ్రెస్. గ్రామ సభ కమిటీలను నియమించేందుకు కూడా కసరత్తులు జరుగుతున్నాయి.
ఇదీ చూడండి:-కాంగ్రెస్‌కు షాక్- ఇద్దరు సీనియర్ నేతల రాజీనామా
ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ఆదివారం.. రెండు రోజుల రాయ్‌బరేలీ పర్యటనను చేపట్టారు ప్రియాంక. కాంగ్రెస్ అధ్యక్షురాలు, తన తల్లి సోనియా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కార్యకర్తలతో సమావేశమయ్యారు.