విపరీతమైన మద్యపానం అలవాటుగా మారిన, దేహదారుఢ్యం దెబ్బతిన్న 300 మందికి పైగా పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) కల్పిస్తున్నట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆదివారం ప్రకటించారు. ఇది పాత నిబంధనే అయినా.. ఇంతకు ముందెన్నడూ ఏ ప్రభుత్వం అమలు చేయలేదని తెలిపారు. వీఆర్‌ఎస్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఖాళీల భర్తీకి నియామకాలు చేపట్టి యువతకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు సైతం నిర్వహిస్తున్న హిమంత బిశ్వశర్మ.. గువహతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రం మొత్తంలో ఇలాంటి పోలీసులు 4,000 మందికిపై పైగా ఉన్నారని.. తొలి దశలో 300 మందికి వీఆర్‌ఎస్ ఇస్తామని చెప్పారు. వీరిని గుర్తించేందుకు హోం శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందని సీఎం తెలిపారు.
"అతిగా మద్యం తాగేవారు, లావుగా ఉన్న పోలీసులకు వీఆర్‌ఎస్ అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. వీరి స్థానంలో యువతకు అవకాశాలు కల్పిస్తాం. రాష్ట్రంలో స్మార్ట్ పోలీసింగ్ సేవల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రతి నియోజకవర్గం పరిధిలో నూతన డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలు ప్రారంభిస్తాం. ఈ కార్యాలయాలకు కేవలం శాంతిభద్రతల అంశాలను మాత్రమే కాకుండా.. ఇతర బాధ్యతలను కూడా అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నాం."
--హిమంత బిశ్మశర్మ, అసోం సీఎం
'ఇప్పట్లో కేబినెట్ మార్పులు లేవు'
లోక్సభ ఎన్నికల వరకు కేబినెట్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ప్రజలు ప్రతి పనికి జిల్లా కేంద్రానికి పరుగులు తీయకుండా పరిపాలన వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సుమారు 50,000 మందికి ఒకేసారి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. మే 11న జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు అవుతారని చెప్పారు. గ్రేడ్ 3, గ్రేడ్ 4 నియమాక ఫలితాలను బోర్డు ఇటీవల విడుదల చేసింది.
మూడు రోజలు వేడుకలు
ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై మే 10 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
2021లో మిత్ర పక్షాలతో బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఏడాది మేలో జరిగిన అసోం శాసనసభ ఎన్నికల్లో 126 స్థానాలకు గాను బీజేపీ 75, కాంగ్రెస్ 50 స్థానాల్లో విజయం సాధించింది. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. హిమంత బిశ్వశర్మను ముఖ్యమంత్రిగా నియమించింది.
ఇవీ చదవండి :కేంద్రం కీలక నిర్ణయం.. 14 యాప్లు బ్లాక్.. ఉగ్రవాదులు వాడుతున్నందుకే!
ఏడాదికి 3 సిలిండర్లు, రోజూ అరలీటర్ నందిని పాలు ఫ్రీ.. రాష్ట్రంలో UCC అమలు.. బీజేపీ హామీల వర్షం!