సాధారణంగా పోలీస్ స్టేషన్లు ఒకే రంగులో ఉంటాయి. దాదాపు అన్ని స్టేషన్లలోనూ.. ఒకే తరహా వాతావరణం ఉంటుంది. అయితే, తమిళనాడులోని రాణిపేట జిల్లాలోని ఠాణాలు మాత్రం ఇందుకు మినహాయింపు. ఇక్కడ స్టేషన్లన్నీ సప్త వర్ణాలతో కనువిందు చేస్తాయి. వివిధ రకాల బొమ్మలు, చక్కటి రాతలతో అలరిస్తాయి. దీని వెనక ఉన్న ఆలోచన ఓ విశ్రాంత పోలీసు ఉన్నతాధికారిది. 5 లక్షల రూపాయలతో ప్రారంభించిన.. ఈ వినూత్న కార్యక్రమంలో ప్రముఖ రంగుల తయారీ సంస్థ నిప్పన్ కూడా పాలుపంచుకుంటోంది.
అందులో భాగమే..
గతంలో రాణిపేట జిల్లాకు ఎస్పీగా పనిచేసిన మిల్వగనన్ ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. రాణిపేట గతంలో వెల్లూరు జిల్లాలో ఉండేది. 2019లో వెల్లూరును 3 జిల్లాలుగా విభజించడం వల్ల ఇది జిల్లాగా ఏర్పడింది. ఈ జిల్లాకు మొదటి ఎస్పీగా మిల్వగనన్ పనిచేశారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడి పోలీసింగ్‌లో ఆయన పలు మార్పులు తీసుకువచ్చారు. అందులో భాగమే ఠాణాల సుందరీకరణ.