తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీఎస్​పీఎస్సీలో ఐపీ అడ్రస్‌లను మార్చి పేపర్లు కొట్టేశారు.. - Rajasekhar accused in TSPSC paper leakage case

TSPSC Paper Leak Case Updates: సంచలనగా మారిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే 9 మంది నిందితులను పోలీసు కస్టడీకి తీసుకున్న అధికారులు.. వీరిని హిమాయత్‌నగర్‌ సిట్‌ కార్యాలయానికి తరలించి విచారించారు. ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు నిందితులు అనుసరించిన వ్యూహంపై ప్రశ్నించారు. కంప్యూటర్లలో భద్రపరచిన అంశాలను గుర్తించగలిగారు. యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌ ఎలా సేకరించారనే వివరాలు రాబట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది. కార్యాలయం సమయం ముగిశాక రాత్రి వేళల్లో ప్రవీణ్, రాజశేఖర్​రెడ్డి ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవారంటూ తాజాగా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలోనే చాకచక్యంగా పత్రాలు పెన్‌డ్రైవ్‌లోకి మార్చి ప్రింట్లు తీసుకున్నట్టు అంచనాకు వచ్చారు.

TSPSC  paper leak case
TSPSC paper leak case

By

Published : Mar 18, 2023, 4:48 PM IST

Updated : Mar 18, 2023, 10:26 PM IST

TSPSC Paper Leak Case Updates: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ప్రధాన నిందితులకు కార్యాలయంలో మరికొందరు ఉద్యోగులు సహకరించారా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. వీటిని నిర్దారించేందుకు అవసరమైన సమాచారంపై సిట్‌ అధికారులు దృష్టిసారించారు. కమిషన్‌ కార్యాలయంలోని కంప్యూటర్లను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపించారు. సైబర్, ఫోరెన్సిక్‌ నిపుణులు నిందితుల మొబైల్‌ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లను పూర్తిగా విశ్లేషిస్తున్నారు.

కార్యాలయంలో అణవణువు తెలిసి, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రధాననిందితుడు ఏఎస్‌వో ప్రవీణ్‌కుమార్, నెట్‌వర్క్‌ అడ్మిన్‌ రాజశేఖర్​రెడ్డి ఇద్దరూ కలిసే మోసానికి పాల్పడినట్టు నిర్దారణకు వచ్చారు. కమిషన్‌లో వీరిద్దరు ఆయా విభాగాల్లో ముఖ్యమైన వ్యక్తులు కావటంతో అధికారులు, సిబ్బంది ఏ మాత్రం అనుమానించ లేకపోయారు. ఈ అవకాశాన్ని నిందితులు తెలివిగా ఉపయోగించుకొని పెద్దమొత్తంలో లబ్ధి పొందాలనుకున్నారు.

కాగా ప్రశ్నపత్రాల లీకేజ్‌లో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌తో సహా రాజశేఖర్‌రెడ్డి, రేణుక, ఢాక్యానాయక్, రాజేశ్వర్‌నాయక్, నీలేష్‌నాయక్, గోపాల్‌నాయక్, శ్రీనివాస్, కె.రాజేంద్రనాయక్‌లను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి కింగ్‌కోఠి ఆసుపత్రికి తరలించారు. సుమారు 2 గంటల పాటు 9 మంది నిందితులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం నిందితులను కమిషన్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు.

ప్రవీణ్, రాజశేఖర్​రెడ్డిలతో కలసి సిట్‌ అధికారులు కాన్ఫిడెన్షియల్, కార్యదర్శి విభాగాలను పరిశీలించారు. ప్రశ్నపత్రాలు చోరీకు ఉపయోగించినట్టు నిందితులు ఇచ్చిన సమాచారంతో రెండు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం 9 మందిని హిమాయత్‌నగర్‌లోని సిట్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. 6 రోజుల కస్టడీలో భాగంగా మొదటిరోజు సిట్‌ చీఫ్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ సారథ్యంలో ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి, రేణుకలను వేర్వేరుగా ప్రశ్నించి వాంగ్మూలం సేకరించారు. మొదట్లో పోలీసులకు సహకరిస్తున్నట్టు నటించినా.. తర్వాత పొంతనలేని సమాధానాలతో ఒకరిపై ఒకరు తప్పులను నెట్టేసుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం.

సాంకేతిక పరిజ్ఞానం సాయంతో.. వాటిని కొట్టేసే మార్గాల అన్వేషణ: టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయగానే ప్రవీణ్, రాజశేఖర్​రెడ్డి అప్రమత్తమయ్యారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వాటిని కొట్టేసేందుకు అనుకూలమైన మార్గాలను అన్వేషించారు. కాన్ఫిడెన్షియల్‌ విభాగంలో భద్రపరిచే ప్రశ్నపత్రాలను కాజేసేందుకు.. ఆ విభాగంలోని అధికారి కంప్యూటర్‌కు డైనమిక్‌ ఐపీ అడ్రసు బదులు.. స్టాటిక్‌ ఐపీ ఇచ్చినట్టు రాజశేఖర్​రెడ్డి అంగీకరించాడు. ఆ అధికారికి కేటాయించిన ఐపీ అడ్రసును.. రాజశేఖర్​రెడ్డి తన కంప్యూటర్‌ ద్వారా లాగిన్‌ అయ్యాడు.

లీకైన ప్రశ్నపత్రాలను ఎవరికి విక్రయించారు?: అనంతరం శంకర్‌ లక్ష్మికి సంబంధించిన ఫోల్డర్‌ను.. ప్రవీణ్‌ ఇచ్చిన 4 పెన్‌డ్రైవ్‌ల్లో కాపీ చేశాడు. ఆ అధికారి కంప్యూటర్‌ నుంచి డేటా చోరీ చేస్తే తేలికగా గుర్తిస్తారనే ఉద్దేశంతో.. ఈ మార్గం ఎంచుకున్నట్టు ప్రవీణ్‌ అంగీకరించినట్టు సమాచారం. ప్రవీణ్‌కు యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌ ఎలా వచ్చాయనే దానిపై పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. కమిషన్‌ కార్యదర్శి డైరీ నుంచి సేకరించానంటూ ముందుగా అంగీకరించాడు. మరోసారి కాన్ఫిడెన్షియల్‌ సూపరింటిండెంట్‌ వద్ద డైరీ నుంచి.. తన పుస్తకంలో రాసుకున్నానంటూ సిట్‌ బృందాన్ని ఏమార్చే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. లీకైన ప్రశ్నపత్రాలను ఎవరికి విక్రయించారు? ఎంత లబ్ధిపొందారనే వివరాలు రాబట్టేందుకు మరికొంత సమయం పడుతుందని సిట్‌ అధికారులు తెలిపారు.

మరికొన్ని విషయాలను గుర్తించిన పోలీసులు:దర్యాప్తులో మరికొన్ని విషయాలను కూడా పోలీసులు గుర్తించారు. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ సివిల్‌ ప్రశ్నపత్రం అమ్మటం ద్వారా రేణుక దంపతుల నుంచి ప్రవీణ్‌కు విడతల వారీగా రూ.10లక్షలు చేతికందాయి. మార్చి 6 వరకు ఈ నగదును ఇంట్లోనే భద్రపరిచాడు. అనంతరం అతడి బాబాయి బ్యాంకు ఖాతాలో రూ.3.50లక్షలు జమచేశాడు. మరో రూ.6లక్షలు తన బ్యాంకు ఖాతాలో వేశాడు. మిగిలిన రూ.50,000 జల్సా చేసినట్టు పోలీసుల ఎదుట అంగీకరించాడు. ప్రశ్నపత్రాలు కాపీ చేసేందుకు సహకరించిన రాజశేఖర్​రెడ్డికి.. మరో విధంగా లబ్ది చేకూర్చుతానని ప్రవీణ్‌ హామినిచ్చాడని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ప్రవీణ్‌ తన ఖాతాలో నగదు జమచేసినట్టు చెప్పటం అవాస్తవమని పోలీసుల దర్యాప్తులో అతడి బాబాయి చెప్పినట్టు సమాచారం.

ఇవీ చదవండి:TSPSC పేపర్​ లీకేజీ కేసు.. నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

ఖలిస్థానీ నేతపై ఉక్కుపాదం.. అమృత్​పాల్​ అరెస్ట్​.. పంజాబ్​లో ఇంటర్నెట్ బంద్​

Last Updated : Mar 18, 2023, 10:26 PM IST

ABOUT THE AUTHOR

...view details