Bandi Sanjay A1 Accused In 10th Paper Leakage: రాష్ట్రంలో మొన్నటి వరకు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు, ఆతర్వాత పదో తరగతి పేపర్ లీకేజీ కేసు.. ఇప్పుడు బండి సంజయ్ అరెస్ట్‌తో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయంగా బండి అరెస్ట్ రాజకీయ దుమారాన్నే సృష్టించింది. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ కుమార్‌ను నిందితునిగా భావిస్తూ.. పోలీసులు నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అయితే తాజాగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో బండి సంజయ్‌ను ఏ-1గా చేర్చారు.
అలాగే పేపర్ లీకేజీ కేసులో సూత్రధారిగా ఉన్న ప్రశాంత్‌ను పోలీసులు ఏ-2గా చేర్చి.. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు ఆ రిపోర్టులో తెలిపారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఏ-1 బండి సంజయ్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేశారు. 120బి, 420, 447, 505 సెక్షన్ల కింద సంజయ్‌పై కేసులు నమోదు చేసి.. హనుమకొండ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
రిమాండ్ రిపోర్టులో బండి సంజయ్ ఏ1: 8 పేజీల రిమాండ్ రిపోర్టును కమలాపూర్ పోలీసులు తయారు చేశారు. పదో తరగతి విద్యార్థుల్లో గందరగోళం సృష్టించి.. వారిలో లేనిపోని భయాలను కల్పించేందుకే కుట్ర చేశారని కేసు నమోదు చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అనుచరులే పేపర్ లీకేజీ చేశారని.. రిపోర్టులో పేర్కొన్నారు. సంజయ్ ప్రోత్సాహంతోనే పేపర్ లీకేజీ జరిగినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు న్యాయవాది తెలిపారు. అందుకే బండి సంజయ్‌ను ఏ-1గా చేర్చినట్లు చెప్పారు.