బంగాల్లోని నందిగ్రామ్‌లో శాసనసభ ఎన్నికల ప్రచారం ఆఖరి రోజున.. 'ఆఖరి పంచ్' కోసం టీఎంసీ-భాజపా తీవ్రస్థాయిలో పోటీపడ్డాయి. అగ్రనేతల రోడ్‌షోలు, సభలు, విమర్శలు, ఆరోపణలతో నందిగ్రామ్ వీధులు హోరెత్తాయి. 'దీదీ జిందాబాద్' అంటూ టీఎంసీ కార్యకర్తలు ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లగా.. 'జై శ్రీరామ్' నినాదాలతో కమలదళం రాజకీయ వేడిని పెంచింది. ఈ క్రమంలో అధికార-విపక్ష పార్టీల అగ్రనేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు.
పోలీసు బలంతో...
గత రెండు రోజులుగా నందిగ్రామ్‌లోనే ఉన్న మమత.. మంగళవారం ప్రచార పర్వాన్ని మరింత జోరుగా సాగించారు. చక్రాల కుర్చీపైనే నందిగ్రామ్ వీధుల్లో ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. భంగపొర నుంచి దాదాపు 3 కిలోమీటర్లు రోడ్‌షో నిర్వహించి.. టీఎంసీకి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.
అంతకుముందు జరిగిన ఎన్నికల సభలో భాజపాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
"భాజపా పాలిత రాష్ట్రం(మధ్యప్రదేశ్) నుంచి వాళ్లు పోలీసులను రప్పించారు. గ్రామాల్లోని ఓటర్లను పోలీసులు భయపడెతూ.. భాజపాకు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ నందిగ్రామ్‌లో విజయం నాదే. రాష్ట్రంలో మూడోసారీ టీఎంసీదే గెలుపు. వాళ్లు(పోలీసులు) ఇక్కడ కొన్ని రోజులే ఉంటారు. మేము మళ్లీ అధికారంలోకి వచ్చి వాళ్లకు గట్టి జవాబు చెబుతాము."
-- సంచోరా సభలో మమత.
ఈ క్రమంలో భాజపాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీదీ. నందిగ్రామ్‌లోని ఓ మహిళను చంపేందుకు వారు ప్రణాళిక రచించారని.. ఇందుకోసం బిహార్ నుంచి గూండాలను తీసుకొచ్చారని ఆరోపించారు. అలా హత్య చేసి, చివరకు దానిని బంగాల్ మీద నెట్టేద్దామని వారు చూస్తున్నట్టు పేర్కొన్నారు.