TSPSC Paper Leakage Updates: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. అలా చేస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పోలీసులు తమ విచారణలో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ను స్త్రీ లోలుడిగా తేల్చారు.
Nude videos in TSPSC paper leakage case accuser's mobile : ''ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ 2017లో టీఎస్‌పీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరాడు. నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ సెక్షన్‌లో పని చేశాడు. వెరిఫికేషన్ సెక్షన్‌కు వచ్చే మహిళల ఫోన్ నంబర్లు తీసుకునేవాడు. దరఖాస్తులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి.. సాన్నిహిత్యం పెంచుకునేవాడు. పలువురు మహిళలతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నట్టు మా విచారణలో తేలింది'' అని పోలీసులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. పోలీసులు ప్రవీణ్ ఫోన్‌లో ఎక్కువ సంఖ్యలో మహిళల ఫోన్ నంబర్లు గుర్తించారు. వాట్సప్ చాటింగ్‌లోనూ మహిళల నగ్న ఫొటోలు, దృశ్యాలు ఉన్నట్లు సమాచారం. ఏఈ పరీక్షా పత్రం కూడా ఉపాధ్యాయిని రేణుక కారణంగానే లీక్ అయిందని తేల్చారు. ఏడాది క్రితం పదోన్నతి లభించి టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా వెళ్లిన ప్రవీణ్.. ఉన్నతాధికారుల వద్ద ఎంతో క్రమశిక్షణతో మెలిగేవాడని, దీనినే ఆసరాగా తీసుకుని పేపర్ లీకేజీకి తెర లేపాడని తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేయగా.. వారిలో ప్రవీణ్ ప్రధాన నిందితుడు కాగా.. ఉపాధ్యాయురాలు రేణుక, మరో ఉద్యోగి రాజశేఖర్‌రెడ్డిలు అరెస్టైన వారిలో ఉన్నారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన టీఎస్‌పీఎస్సీ చర్యలకు ఉపక్రమించింది. ప్రవీణ్, పొరుగుసేవల ఉద్యోగి రాజశేఖర్‌రెడ్డిలను విధుల నుంచి తొలగించింది. ఘటనపై శాఖాపరమైన విచారణ ప్రారంభించింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ వెల్లడించారు.