Constable shot dead: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతంలో ఓ కానిస్టేబుల్‌పై తూటాల వర్షం కురిపించారు. అతని ఏడేళ్ల కుమార్తెపైనా కాల్పులకు తెగబడ్డారు. తీవ్రగాయాలపాలైన వీరిని ఆస్పత్రికి తరలించగా.. కానిస్టేబుల్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కుడి చేతికి బుల్లెట్ గాయమైన అతని కుమార్తెకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మృతి చెందిన కానిస్టేబుల్‌ను సౌరాలోని మాలిక్ సాహిబ్ ప్రాంతానికి చెందిన సైఫుల్లా ఖాద్రిగా గుర్తించినట్లు చెప్పారు. కూతుర్ని ట్యూషన్ నుంచి తీసుకెళ్లి ఇంటివద్ద డ్రాప్ చేస్తుండగా.. ఉగ్రవాదులు దాడి చేసినట్లు వివరించారు.