Woman Murder Case Update: రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రకాశం జిల్లాలోని వివాహిత హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఆమెపై భర్తే కారు ఎక్కించి దారుణ హత్యకు పాల్పడినట్లు ఒంగోలు ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 17న వెలుగొండ్ల మండలం జిల్లెళ్లపాడుకు చెందిన కోట రాధ రోడ్డు ప్రమాదంలో మరణించలేదని హత్యకు గురైనట్లు ఎస్పీ వెల్లడించారు. షాపింగ్ కోసమని వెళ్లిన రాధ తిరిగి ఇంటికి రాకపోవటంతో ఆమె తల్లిదండ్రులు కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ క్రమంలో పామూరు-వెలిగండ్ల మధ్యలో రాధ మృతదేహాన్ని అనుమానాస్పద స్థితిలో పోలీసులు రోడ్డుపై గుర్తించినట్లు తెలిపారు. దీంతో పోలీసులు 8 బృందాలుగా విడిపోయి దర్యాప్తు జరిపినట్లు వివరించారు. దర్యాప్తులో ఆమెను హత్య చేసింది ఆమె భర్త మోహన్ రెడ్డే అని తేలినట్లు వివరించారు. ఈ హత్య కేసులో పోలీసులకు చెప్పకుండా భర్త నిజాలను దాచటంతో అతడే హంతకుడు అనే విషయాన్ని పోలీసులు ఊహించలేదని తెలిపారు. హత్య కేసులో లోతుగా దర్యాప్తు చేసినప్పుడు అసలు నిజాలు బయటపడ్డాయన్నారు.
భర్తే హంతకుడు.. పథకం ప్రకారం అంతమొందించాడు: ఎస్పీ హత్యకు గురైన రాధకు కాశిరెడ్డి అనే పాఠశాల మిత్రునితో ఆర్థిక వివాదాలు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. దీనివల్ల రాధకు ఆమె భర్తకు మధ్య ఆర్థిక వివాదాలు తలెత్తాయని ఎస్పీ తెలిపారు. దాదాపు 10రోజుల క్రితం రాధ భర్త ఇతర వ్యక్తుల పేరుతో సిమ్ కార్డ్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆ సిమ్ కార్డ్ ద్వారా కాశిరెడ్డి పేరుతో రాధకు మెసేజ్ చేసినట్లు తెలిపారు. కాశిరెడ్డి అప్పు తీసుకున్న నగదు తిరిగి ఇస్తానని ఆ మెసేజ్‌లో ఉన్నట్లు తెలిపారు. నగదు తిరిగి ఇస్తానని పామూరు బస్టాండ్ వద్దకు రావాలని.. వచ్చేటప్పుడు తోడుగా ఎవర్ని తీసుకుని రావద్దని, ఒంటరిగా రావాలని సూచించినట్లు వివరించారు. ఆ మెసేజ్ చూసి నమ్మి ఆమె పామూరు బస్టాండ్‌కు వచ్చినట్లు తెలిపారు.
రాధను పామూరుకు రమ్మని చెప్పిన ఆమె భర్త హైదరాబాద్ నుంచి ఒంగోలుకు కారు అద్దెకు తీసుకుని వచ్చినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో కారుకు తప్పుడు నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పామూరు బస్టాండ్ వద్ద ఆమెను కారులో ఎక్కించుకున్న.. భర్త కనిగిరి పరిసర ప్రాంతల్లోనే కొద్దిసేపు తిప్పినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరి మధ్య వివాదాలు మళ్లీ మొదలయ్యాయన్నారు. కనిగిరి-పామూరు మధ్యలో కారులోనే ఆమె భర్త రాధను చున్నీతో ఉరి వేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆమె ప్రాణాలు కోల్పోవటంతో హత్యగా గుర్తించకుండా ఉండేందుకు.. మృతదేహాన్ని రోడ్డుపై వదిలి కారు మృతదేహంపైకి ఎక్కించినట్లు వివరించారు. ఆమె చనిపోయిన తర్వాత మంగళసూత్రాన్ని అతని వెంటే తీసుకువెళ్లినట్లు తెలిపారు. శరీరంపై ఎలాంటి సిగరెట్ గాయాలు లేవని.. కారు ఎక్కించినప్పుడు రోడ్డు గీసుకుపోవటం వల్ల ఏర్పడిన గాయాలు ఉన్నట్లు వివరించారు. అక్కడ ఎలాంటి ఆధారాలు లభించకుండా ఉండేందుకు నిందితుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కేవలం కాశిరెడ్డితో చాట్ చేసినట్లు ఉన్న ఆధారాలు మాత్రమే అక్కడ వదిలి వెళ్లినట్లు తెలిపారు.
నాటకం అడ్డం తిరిగిందిలా...:కాశిరెడ్డి తమ కుమార్తెను హత్య చేశాడని రాధ తల్లిదండ్రులు తొలుత ఫిర్యాదు చేశారు. ఆ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పోలీసు విచారణ సాగుతుండగా రాధ భర్త మోహన్ రెడ్డి అక్కడే ఉన్నాడు. ఏమీ తెలియదన్నట్టు వ్యవహరించాడు. తన భార్యను కాశిరెడ్డే హత్య చేశాడంటూ పోలీసులను కూడా నమ్మించాడు. అదే సమయంలో పోలీసులు అతని కదలికలపై కన్నేశారని పసిగట్టలేకపోయాడు. హత్య జరిగిన సమయంలో నిందితుడు మోహన్‌రెడ్డి కనిగిరిలోనే ఉన్నట్టు పోలీసులు గూగుల్ టేకౌట్ ద్వారా గుర్తించారు. అయినా ఆ రోజు హైదరాబాద్‌లో ఉన్నట్టు అందరితోనూ నమ్మబలకడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో ఎంత తెలివిగా నాటకమాడినప్పటికీ హంతకుడు ఎవరన్నది పోలీసులకు స్పష్టత వచ్చినట్లైంది.
ఇవీ చదవండి :