Police Beating Women: ఇసుక తవ్వకంపై బిహార్‌లో పోలీసులకు, గ్రామస్థులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. గయా జిల్లాలోని అధత్‌పుర్ గ్రామస్థులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పిల్లలు, మహిళలను కూడా చూడకుండా చేతులు కట్టేసి దారుణంగా కొట్టారు. మాఫియాతో కలిసి తమను విచక్షణారహితంగా కొట్టారని స్థానికులు వాపోతున్నారు. తమ గ్రామానికి దగ్గరగా ఇసుక తవ్వకం జరపొద్దని కోరినట్లు తెలిపారు. వర్షాకాలంలో నదీ ప్రవాహం పెరిగినప్పుడు ఇసుకకోతకు గురై గ్రామానికి ప్రమాదం ఉంటుందని శాంతియుతంగా మాట్లాడుతున్నప్పుడు పోలీసులు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమపై టియర్ గ్యాస్‌ను కూడా ప్రయోగించారని స్థానికులు తెలిపారు. గ్రామస్థులు భయపడి ఇళ్లకు వెళ్లినా.. పోలీసులు వెంబడించారని ఆరోపించారు. ఇళ్ల నుంచి బయటికిలాగి కొట్టారని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే సురేంద్ర యాదవ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. గ్రామస్థులకు న్యాయం దక్కేవరకు పోరాడుతానని అన్నారు.