Police Attack on Amaravati Farmers: అమరావతి రైతులపై పోలీసులు మరోసారి రెచ్చిపోయారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో 1254 రోజులుగా శాంతియుతంగా దీక్ష చేస్తున్న రైతులపై.. తమ ప్రతాపం చూపారు. R-5 జోన్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం, అనుకూలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలకు పిలుపునివ్వడంతో పాటు... జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ దీక్షకు పిలుపునివ్వడాన్ని సాకుగా చూపి... శాంతియుత నిరసన చేస్తున్న రైతులు, మహిళలపై అత్యంత కర్కశంగా వ్యవహరించారు. దీక్షా శిబిరంలో నిరసనకు అనుమతి లేదంటూ.. రైతులపై విరుచుకుపడ్డారు. మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా ఈడ్చిపడేశారు. భారీగా మోహరించిన పోలీసులను ప్రతిఘటించడం.. కొద్ది మంది రైతుల వల్ల కాలేదు. దీంతో పోలీసులు మరింత రెచ్చిపోయారు. నిరసనకు వస్తున్న వారిని లాక్కెళ్లి పోలీసు వాహనాల్లో పడేశారు. ఈ పరిణామాలతో మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు.
డీఎస్పీ పోతురాజు క్షమాపణలు చెప్పాలని డిమాండ్: రైతులకు సంఘీభావం తెలపడానికి వచ్చిన జడ శ్రవణ్‌కుమార్‌ని సైతం అరెస్టు చేసి తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసుల తీరుపై మహిళా రైతులు తీవ్రంగా మండిపడ్డారు. తమ సొంత స్థలాల్లో దీక్ష చేస్తుంటే అడ్డుకోవడానికి పోలీసులు ఎవరని ప్రశ్నించారు. రాజధాని లేని రాష్ట్రానికి భూములివ్వడమే తాము చేసిన నేరమా అంటూ నిలదీశారు. పోలీసు యూనిఫాం వేసుకుని మహిళలను బూతులు తిట్టే హక్కు ఎవరిచ్చారంటూ.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్పీ పోతురాజు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
"మహిళలు అన్న గౌరవం కూడా లేకుండా చాలా దారుణమైన పదజాలాన్ని వాడారు. డీఎస్పీ పోతురాజు వచ్చి మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఎవరిని అడిగి భూములు ఇచ్చారని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయన ఒక హోదాలో ఉండి మహిళలను ఇలాంటి పరుష పదజాలంతో దూషిస్తారా. ఒక హత్య కేసులో సహనిందితుడిగా ఉన్న ఎంపీని అరెస్టు చేయడానికి సీబీఐ అధికారులు వస్తే శాంతి భద్రతల సమస్య అని ఓ జిల్లా యంత్రాగం మొత్తం చేతులెత్తేసింది. అదే శాంతియుతంగా నిరసన చేస్తున్న మాపై ఎందుకు దాడి చేస్తున్నారు"-బాధితులు