Cyber Fraud Gang Arrest in Hyderabad : పెద్దఎత్తున సైబర్ మోసాలకు పాల్పడుతున్న 9 మంది ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు చెందిన డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.10.5 కోట్ల నగదుతో పాటు 17 సెల్ ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు, బ్యాంకు పాస్‌బుక్‌లు, డొల్ల కంపెనీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దేశవ్యాప్తంగా 15 వేల మందికి పైగా మోసం చేసి.. రూ.712 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు తేల్చారు. హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన శివకుమార్ అనే వ్యక్తికి కొన్ని నెలల క్రితం టెలీగ్రామ్‌లో సందేశం వచ్చింది. పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ.. భారీగా సంపాదించొచ్చని ఆ సందేశం సారాంశం. దీంతో శివకుమార్ ఆ మెసేజ్‌లో వచ్చిన వెబ్సైట్లో లాగిన్ అయ్యాడు. పూర్తి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత.. శివకుమార్‌కు యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఇచ్చారు. మొదట రూ.1000 జమ చేయాలని సూచించారు. ఆ మేరకు రూ.వెయ్యి జమ చేయగానే.. వారం తిరిగేలోపు శివకుమార్ ఖాతాలో అదనంగా రూ.866 జమ అయ్యాయి. శివకుమార్ వెంటనే రూ.1,866 తీసుకున్నాడు. డబ్బులు ఇచ్చి మోసగాళ్లు శివకుమార్‌ను బుట్టలో వేసుకున్నారు. ఈసారి రూ.25 వేలు జమ చేస్తే రూ.20 వేలు అదనంగా వస్తాయని ఆశ చూపారు. వెంటనే శివకుమార్ రూ.25 వేలు జమ చేశాడు. తన ఖాతాలో 15 రోజుల వ్యవధిలో మొత్తం రూ.45 వేలు ఉన్నట్లు చూపించింది. ఆ నగదు మొత్తాన్ని తీసుకోవడానికి శివకుమార్ ప్రయత్నించినప్పటికీ డబ్బులు రాలేదు. దీంతో వెంటనే నిర్వాహకులను సంప్రదించాడు.
ఆ డబ్బును తీసుకోవాలంటే మరికొంత డబ్బును డిపాజిట్ చేయాలని నమ్మబలికారు. ఇలా ఓసారి రూ.లక్ష, మరోసారి రూ.2 లక్షలు, ఇలా విడతల వారీగా మోసగాళ్లు సూచించిన 6 ఖాతాల్లో రూ.28 లక్షలు జమ చేశాడు. చివరికి మోసపోయానని గుర్తించి.. 3 నెలల క్రితం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. బ్యాంకు ఖాతా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఖాతాలో సైతం నగదు జమ అయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించి.. ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. మహమ్మద్ మునావర్ పేరు మీదు రిజిస్టర్ అయిన రాధిక మార్కెటింగ్ కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతాలో శివకుమార్ వేసిన నగదు జమ అయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. కానీ రాధిక మార్కెటింగ్ అనే కంపెనీ డొల్ల కంపెనీగా సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చారు. అమాయకులను నమ్మించి వాళ్లతో నగదు జమ చేయించడానికి సైబర్ నేరగాళ్లు డొల్ల కంపెనీలు సృష్టించి.. వాటి ద్వారా బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తీగ లాగడంతో డొంక కదిలింది. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ మునావర్‌తో పాటు అరుణ్ దాస్, షా సుమేర్, షమీర్ ఖాన్లు లక్నో వెళ్లి తప్పుడు పత్రాలు సమర్పించి 33 డొల్ల కంపెనీలు రిజిస్టర్ చేయించుకున్నారు. లక్నోకు చెందిన మనీష్, వికాస్, రాజేష్‌ల ఆదేశాల మేరకు నలుగురు కలిసి డొల్ల కంపెనీలు రిజిస్టర్ చేయించారు. ఆ తర్వాత డొల్ల కంపెనీల కోసమని పలు బ్యాంకుల్లో 61 ఖాతాలు తెరిచారు. ఒక్కో ఖాతాను రూ.2 లక్షల చొప్పున మనీష్‌కు విక్రయించారు. మనీష్ తనకు పరిచయం ఉన్న గగన్ సాయంతో కంపెనీల పేరు మీద వెబ్సైట్లు రూపొందించారు. నయూమ్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించాడు. ప్రకాష్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి ఆదేశాల మేరకు మనీష్ ఇవన్నీ చేశాడు. అహ్మదాబాద్‌కు చెందిన ప్రకాష్ ప్రజాపతి వెనకాల చైనీయులున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
పెట్టుబడుల పేరుతో దేశవ్యాప్తంగా రూ.712 కోట్ల మోసానికి పాల్పడిన ముఠాకు చెందిన 9 మందిని అరెస్టు చేశాం. ఈ డబ్బులు పలు మార్గాల్లో క్రిప్టో కరెన్సీ ద్వారా దుబాయ్ నుంచి చైనా వెళ్తున్నాయి. తీవ్రవాదులు ఉపయోగించే క్రిప్టో వెబ్‌సైట్‌కు వెళ్లినట్లు తేలింది. జాతీయ స్థాయిలో సమన్వయం చేసుకొని దర్యాప్తు చేయాల్సి ఉంది. హెజ్ బొల్లా అనే క్రిప్టో వాలెట్ ద్వారా కరెన్సీ చైనా బదిలీ అవుతోంది. తీవ్రవాదులు తమ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. తీవ్రవాదులకు ఏమైనా చేరిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఎన్ఐఏ సహాయం తీసుకొని హెజ్ బొల్లా క్రిప్టో వాలెట్ దర్యాప్తు చేస్తాం.-సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ