Poland Woman Loves Indian : ప్రేమకు హద్దులు లేవంటారు ప్రేమికులు. నచ్చిన మనిషి కోసం ఖండాలు, సప్తసముద్రాలైనా దాటడానికి సిద్ధపడతారు ప్రేమికులు. అచ్చం అలాంటి ఘటనే ఝార్ఖండ్‌లో జరిగింది. ప్రేమించిన వ్యక్తి కోసం తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి పోలాండ్ నుంచి భారత్‌కు వచ్చింది ఓ మహిళ. ఇంతకీ ఏం జరిగిందంటే?
పోలాండ్‌కు చెందిన పోలాక్ బార్బరా(45) అనే మహిళకు.. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలోని ఖుత్రా గ్రామానికి చెందిన మహ్మద్ షాదాబ్ (35).. 2021లో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పోలాక్‌కు ఇప్పటికే వివాహమై.. ఆరేళ్ల కుమార్తె కూడా ఉంది. కొన్నాళ్ల క్రితం పోలాక్.. తన భర్తతో విడాకులు తీసుకుంది. తన ప్రియుడు షాదాబ్‌ను కలిసి పెళ్లి చేసుకుని తనతో పోలాండ్ తీసుకెళ్లాలని భావిస్తుంది. పోలాక్ కంటే ఆమె ప్రియుడు షాదాబ్ 10 ఏళ్లు చిన్నవాడు కావడం గమనార్హం.
పోలాక్ భారత్‌కు రావడం కోసం వీసా దరఖాస్తు చేసుకుంది. సుదీర్ఘ ప్రక్రియ తర్వాత ఆమెకు ఇటీవల వీసా లభించింది. కొద్ది రోజుల క్రితం ఆమె హజారీబాగ్‌లో ఉన్న ఆమె ప్రియుడి షాదాబ్‌ను కలిసింది. అతడితో కలిసే ప్రస్తుతం ఉంటుంది. పోలాండ్ నుంచి వచ్చిన పోలాక్.. ఝార్ఖండ్‌లో వేడికి తట్టుకులేకపోయింది. దీంతో ఆమె ప్రియుడు ఏసీని ఏర్పాటు చేశాడు. ఆమె కోసం కొత్త కలర్ టీవీని సైతం కొన్నాడు. షాదాబ్‌కు ఇంటి పనుల్లో.. పొలాక్ సాయం చేస్తోంది. 'భారత్ చాలా అందమైన దేశం. ఇక్కడి ప్రజలు ప్రేమగలవారు. నన్ను చూసేందుకు రోజుకు వందలాది మంది వస్తున్నారు' అని పోలాక్ చెప్పారు.
ప్రియుడితో పోలాండ్ మహిళ పోలాక్ మరోవైపు.. పోలాండ్ నుంచి పోలాక్ రావడంపై హజారీబాగ్ డీఎస్పీ రాజీవ్ కుమార్ స్పందించారు. హజారీబాగ్‌కు విదేశీయురాలు వచ్చిందని తమకు తెలిసిందని ఆయన చెప్పారు. అందుకే తాను ఖుత్రా గ్రామానికి వెళ్లి ఆమెతో మాట్లాడానని చెప్పారు. 'నేను పోలాక్‌తో మాట్లాడాను. ఆమె మరికొద్ది రోజుల్లో పోలాండ్ వెళ్లిపోతానని చెప్పింది. పోలాక్ ప్రియుడు షాదాబ్‌కు వీసా వచ్చాక అతడిని పోలాండ్ తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.' అని హజారీబాగ్ డీఎస్పీ రాజీవ్ కుమార్ తెలిపారు.