Pneumonia Outbreak India Alert 6 States : చైనాలోని చిన్నారుల్లో శ్వాస సంబంధ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 6 రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైద్య మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. చైనాలో మాదిరిగా సమస్య ఉత్పన్నమైతే ఎదుర్కొనేందుకు ఆస్పత్రులు, ఆరోగ్య సిబ్బందిని సంసిద్ధులను చేయాలని నిర్దేశించింది. ఈ మేరకు రాజస్ధాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హరియాణా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ప్రభుత్వం సూచించింది.
సీజనల్ ఫ్లూతో అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ప్రభుత్వం.. ప్రజలను అప్రమత్తం చేస్తుంది. సీజనల్ ఫ్లూ లక్షణాలు, ప్రమాద కారకాలతో జాబితా రూపొందించటం సహా అంటువ్యాధుల బారిన పడకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. తరుచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించాలని, దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు నోరు, ముక్కు కవర్ చేసుకోవాలని పౌరులకు కర్ణాటక వైద్యశాఖ సూచించింది. మరోవైపు ఈ శ్వాసకోశ వ్యాధి పట్ల ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజస్థాన్ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అయితే, ఈ సీజనల్ ఫ్లూ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందిని ఆదేశించింది. ఆస్పత్రుల్లో అన్ని వసతులను అందుబాటులో ఉంచాలని సూచించింది.
మరోపక్క ఉత్తరాఖండ్‌లోని చమోలి, ఉత్తర్‌కాశీ, పిఠోర్‌గఢ్ జిల్లాలు చైనాకు సరిహద్దులో ఉన్నాయి. దీంతో ముఖ్యంగా ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో శ్వాసకోశ సమస్య కేసులపై నిఘా పెట్టాలని పేర్కొంది. హరియాణా ఆరోగ్యశాఖ.. అసాధారణ శ్వాసకోశ సమస్యలతో ఎవరైనా ఆస్పత్రిలో చేరితో ఆ సమాచారాన్ని తక్షణమే రిపోర్ట్ చేయాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆదేశించింది. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఇదే విధమైన ఆదేశాలు జారీ చేశాయి. ఫ్లూ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించాయి.