తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజకీయాల్లో మోదీ పోస్టుకే అత్యధిక రీట్వీట్లు

ట్విట్టర్‌ వేదికగా ఈ ఏడాది అత్యధికంగా చర్చనీయాంశమైన వ్యక్తులు, అంశాలకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ వెల్లడించింది. లాక్​డౌన్ సమయంలో దీపాలు వెలిగిస్తూ మోదీ చేసిన ట్వీట్.. దేశ రాజకీయాల్లో అత్యధిక రీట్వీట్లు దక్కించుకున్న పోస్ట్​గా నిలిచింది.

PM's tweet about lighting lamps most retweeted post in Indian politics in 2020
రాజకీయాల్లో మోదీ పోస్టుకే అత్యధిక రీట్వీట్లు

By

Published : Dec 8, 2020, 9:54 PM IST

Updated : Dec 8, 2020, 10:01 PM IST

కరోనా లాక్​డౌన్ సమయంలో దీపాలు వెలిగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ట్వీట్.. దేశ రాజకీయా వ్యవహారాల్లో అత్యధికసార్లు రీట్వీట్ అయిన పోస్టు​గా నిలిచింది.

ఏప్రిల్ 3న దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన మోదీ.. తొమ్మిది నిమిషాల పాటు ఇంట్లోని లైట్లు ఆర్పేసి.. దీపాలు వెలిగించాలని ప్రజలకు సూచించారు. కరోనాపై పోరులో ఒకరికొకరు సంఘీభావంగా ఏప్రిల్ 5న రాత్రి తొమ్మిది గంటలకు దీపాలు వెలిగించాలని కోరారు.

ఈ మేరకు ఏప్రిల్ 5న దీపాలు వెలిగించిన ఫొటోలను ట్విట్టర్​లో పంచుకున్నారు మోదీ. ఈ పోస్టుకు 5.13 లక్షల లైక్​లు రాగా.. లక్షా 18 వేలకు పైగా రీట్వీట్లు దక్కాయి.

ప్రపంచవ్యాప్తంగా ట్వీట్లు వీటిపైనే..

మరో మూడు వారాల్లో 2020 ముగుస్తున్న నేపథ్యంలో ఈ ఏడాదిలో ట్విట్టర్‌ వేదికగా అత్యధికంగా చర్చనీయాంశమైన వ్యక్తులు, అంశాలకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ వెల్లడించింది. రాజకీయ మార్పులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడానికి, పలు అంశాలపై ప్రపంచ నేతల నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్‌ చేసేందుకు నెటిజన్లు తమ వేదికను ఉపయోగించుకున్నారని ట్విట్టర్‌ తెలిపింది. ఈ ఏడాదిలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల దగ్గరి నుంచి వివిధ దేశాల్లో జరిగిన ఎన్నికలు, ఇతర అంశాలపై దాదాపు 700 మిలియన్లకు పైగా ట్వీట్లు చేసినట్టు ట్విట్టర్‌ వెల్లడించింది.

అత్యధిక ట్వీట్లు వీరిపైనే

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ట్వీట్లలో టాప్‌-10 వ్యక్తుల జాబితాలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్‌, అమెరికాలో శ్వేతజాతి పోలీసుల కర్కశత్వానికి బలైపోయిన జార్జిఫ్లాయిడ్‌ తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఈ ఏడాది జనవరిలో మృతిచెందిన అమెరికా బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు కోబె బ్రైంట్‌ నాలుగో స్థానంలో నిలిచారు. అలాగే, బరాక్‌ ఒబామా ఐదో స్థానంలో నిలవగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏడో స్థానంలో, అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఇటీవల ఎన్నికైన కమలా హారిస్‌ పదో స్థానంలో ఉన్నారు.

విజయ్‌ సెల్ఫీ రికార్డు..

ట్విట్టర్​ వేదికగా ఈ ఏడాది ఎక్కువ మంది కరోనా వైరస్‌ వ్యాధి గురించే చర్చించుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. కరోనా తర్వాతి స్థానంలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మరణం, యూపీలోని హాథ్రస్‌లో దళిత యువతి హత్యాచారం విషయాలే ఎక్కువగా చర్చలోకి వచ్చాయని పేర్కొంది.

భారత్‌లో తమిళ హీరో విజయ్‌ తన అభిమానులతో తీసుకున్న సెల్ఫీ ఎక్కువసార్లు రీట్వీట్‌ అయి రికార్డు సృష్టించింది. దాదాపు 1,45,000 కంటే ఎక్కువసార్లు రీట్వీట్‌ అయింది. వర్తమాన వ్యవహారాలకు సంబంధించిన ట్వీట్లలో #Covid19, #SushantSinghRajput, #Hathras అంశాలు టాప్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అలాగే, క్రీడల విషయానికి వస్తే.. #IPL2020, #WhistlePodu #TeamIndia టాప్‌లో ఉండగా.. సినిమాల్లోకి వెళ్తే.. #Dilbechara, #sooraraiPottru, #SarileruNeekevvaruలు టాప్-3లో ఉన్నాయి.

Last Updated : Dec 8, 2020, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details