రాజస్థాన్, జైపుర్లో ఏర్పాటు చేసిన పెట్రో కెమికల్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ను(cipet jaipur college) వర్చువల్గా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi news). అలాగే.. బన్స్వారా, సిరోహి, హనుమాన్గఢ్, దౌసా జిల్లాల్లో నిర్మించనున్న నాలుగు వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేశారు.
" కరోనా మహమ్మారి ఆరోగ్య రంగంలో చాలా విషయాలు నేర్పింది. ప్రతి దేశం తమ స్వీయ పద్ధతిలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో నిమగ్నమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ బలాన్ని, స్వశక్తిని పెంచుకోవాలని భారత్ నిర్ణయించింది. దేశ ఆరోగ్య రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు నూతన జాతీయ ఆరోగ్య విధానం కోసం కృషి చేస్తున్నాం. స్వచ్ఛ భారత్ అభియాన్ నుంచి ఆయుష్మాన్ భారత్ వరకు, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అందులో భాగమే. ఇటీవలే ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్.. దేశంలోని నలుమూలలకు ఆరోగ్య సేవలను చేరవేస్తుంది. ఒక్క క్లిక్ దూరంలోనే మంచి ఆసుపత్రులు, ల్యాబ్లు, ఔషధాలు అందుబాటులో ఉంటాయి. రోగుల మెడికల్ పత్రాలను సురక్షితంగా భద్రపరిచేందుకు ఇది ఉపయోగపడుతుంది."