'జల్ శక్తి అభియాన్: వర్షపు నీటిని ఒడిసిపట్టు' ప్రచార కార్యక్రమాన్ని ప్రపంచ జల దినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఇదే రోజున దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అంతరాష్ట్ర నదీ జలాల అనుసంధానం ప్రణాళికకు అడుగులు పడనున్నాయి. కేన్, బేట్వా నదుల అనుసంధానానికి సంబంధించిన అవగాహనా ఒప్పందంపై ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు సంతకాలు చేయనున్నారు.
పడ్డచోటే ఒడిసిపట్టు..
'వర్షపు నీటిని ఒడిసిపట్టు' కార్యక్రమాన్ని దేశమంతటా నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. 'ఎప్పుడు పడ్డా.. పడ్డచోటే వర్షపు నీటిని ఒడిసిపట్టు' అనే నినాదంతో ప్రచారాన్ని సాగించనున్నట్లు పేర్కొంది. మార్చి 22 నుంచి నవంబర్ 30 మధ్య ఈ కార్యక్రమాన్ని జరపనున్నట్లు స్పష్టం చేసింది. ప్రజలందరూ పాలుపంచుకునేలా ప్రోత్సహించనున్నట్లు తెలిపింది. దేశమంతటా గ్రామసభలలో నీటి పరిరక్షణ అవగాహన సమావేశాలు జరపనున్నట్లు వెల్లడించింది.