తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అమృత్ మహోత్సవ్​'కు నేడు మోదీ శ్రీకారం - ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్

'ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్'​ పేరుతో నిర్వహిస్తున్న 75వ స్వాతంత్ర్య వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. దండి మార్చ్ ప్రారంభమై 91 ఏళ్లైన నేపథ్యంలో గుజరాత్​లోని సబర్మతి ఆశ్రమం నుంచి 241 కి.మీ పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అటు.. దేశవ్యాప్తంగా అమృత్ ఉత్సవాలు జరగనున్నాయి.

PM to launch 'Azadi Ka Amrut Mahotsav' today
'అమృత్ మహోత్సవ్​'కు నేడు మోదీ శ్రీకారం

By

Published : Mar 12, 2021, 5:34 AM IST

Updated : Mar 12, 2021, 7:11 AM IST

బ్రిటిష్‌ పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం లభించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ అంబరాన్నంటే వేడుకలకు యావద్దేశం సిద్ధమైంది. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరిట 75 వసంతాల స్వాతంత్ర్యపు సంబరాలకు సమాయత్తమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్​లో ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. దండి యాత్ర 91వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పాదయాత్ర కార్యక్రమానికి ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు.

శుక్రవారం ఉదయం సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర.. 241 మైళ్ల దూరంలోని దండి వరకు సాగనుంది. 25 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. ఏప్రిల్ 5న దండిలో యాత్ర ముగుస్తుంది. దేశ ప్రజలను ఏకం చేసిన మహాత్ముడి స్ఫూర్తితో ఈ పాదయాత్ర జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

సబర్మతి ఆశ్రమంలో ఏర్పాట్లు

ప్రధాని మోదీ.. పాదయాత్రను ప్రారంభించిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆయా రాష్ట్రాల్లో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రదర్శనల్లో దండి యాత్ర, మహాత్మ గాంధీ, నేతాజీ, సర్దార్ పటేల్ సహా ఉద్యమ నాయకుల త్యాగాలను ప్రతిబింబించే కార్యక్రమాలు ఉంటాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది.

ఆశ్రమం వద్ద పోలీసుల భద్రత

అప్పటి యాత్రను తలపించేలా

ఉప్పు తయారీపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ జాతిపిత మహాత్మా గాంధీ 1930 మార్చి 12న దండి యాత్ర ప్రారంభించారు. 81 మంది వ్యక్తులతో సబర్మతి నుంచి దండి వరకు కాలినడకన ప్రయాణించారు. ఏప్రిల్ 5న ఈ యాత్ర ముగిసింది. ఇదే స్పూర్తితో.. మోదీ ప్రారంభించే యాత్ర 24 రోజుల పాటు కొనసాగనుంది. 81 మంది యాత్రికులు అహ్మదాబాద్ నుంచి నవ్సారీ జిల్లాలోని దండి గ్రామం వరకు ప్రయాణించనున్నారు. బైక్ రైడర్లు సైతం ఈ యాత్రలో పాల్గొననున్నారు. 75 కి.మీ వరకు యాత్రకు తాను నేతృత్వం వహిస్తానని కేంద్రమంత్రి ప్రహ్లద్ సింగ్ పటేల్ తెలిపారు. అమృత్ మహోత్సవాలు దేశవ్యాప్తంగా జరగనున్నట్లు తెలిపారు. 75 వారాల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు ప్రతి వారం కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.

సబర్మతి ఆశ్రమ ప్రాంగణం

విభిన్న రూపాల్లో

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు దేశవ్యాప్తంగా 2022 స్వాతంత్ర్య దినోత్సవం వరకు విభిన్న రూపాల్లో జరగనున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకుని ప్రదర్శనలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు, వర్చువల్‌ సమావేశాలు జరగనున్నాయి. స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు ఊరురా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ ఉత్సవాలపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వర్చువల్‌గా సమావేశం అయ్యారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకుని 259 మంది ప్రముఖులతో ప్రధాని ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రజలందరీ భాగస్వామ్యంతో ఈ వేడుకలు ముందుకు సాగాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని కలిగి ఉండాలని సూచించారు.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను ఐదు రకాలుగా విభజించారు. 75 ఏళ్లలో భారత్ ఆలోచనలు, సాధించిన విజయాలు, తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలు, పరిష్కరించిన సమస్యలపై పలు రూపాల్లో 75 వారాల పాటు చర్చించనున్నారు.సనాతన భారత్‌ నుంచి ఆధునిక భారత్‌గా ఆవిర్భవించిన తీరును విశ్లేషించనున్నారు. శాస్త్రవేత్తల విజయాలను కీర్తించనున్నారు. ఈ వేడుకల్లో స్వాతంత్ర్యపు ఉద్యమంలో వెలుగు చూడని వీరుల గాధలు, మహిళా స్వాతంత్ర్య సమరయోధులు, ఈశాన్య భారత పోరాటాలు, ఎర్రకోటలో భారత జాతీయ ఆర్మీ రైలు, స్వాతంత్ర్య ఉద్యమంలో పత్రికల పాత్ర వంటి అంశాలపై ప్రచురణలను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు కేంద్రం తెలిపింది.

Last Updated : Mar 12, 2021, 7:11 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details